జేమ్స్‌బాండ్ మూవీ `నో టైమ్ టు డై`కి నో టైమ్ టు రిలీజ్.. మళ్లీ వాయిదా పడిన సినిమా!
హాలీవుడ్ సినిమాల్లో జేమ్స్‌బాండ్ చిత్రాలకు ఉన్న ప్రత్యేకతే వేరు. జేమ్స్‌బాండ్ చేసే సాహస విన్యాసాలు పిల్లలతోపాటు పెద్దల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటాయి. 1953లో ఇయాన్ ఫ్లెమింగ్ అనే నవలా రచయిత జేమ్స్‌బాండ్ క్యారెక్టర్‌ను క్రియేట్ చేశాడు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అయిన జేమ్స్‌బాండ్ తనకు అప్పగించిన ఏ ఆపరేషన్ని అయినా సమర్థవంతంగా పూర్తి చేస్తాడు. జేమ్స్‌బాండ్ సృష్టికర్త 1964లోనే కన్నుమూసినా ఇప్పటికీ ఆయన రాసిన నవలల ఆధారంగానే జేమ్స్‌బాండ్ సినిమాలు రూపొందుతున్నాయి. 1962లో మొదటి బాండ్ మూవీ `డాక్టర్ నో` విడుదలైంది. ఈ సినిమాలో సీన్ కానరీ బాండ్ పాత్రను పోషించాడు. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో ఇప్పటివరకు 26 సినిమాలు వచ్చాయి. 27వ సినిమాగా `నో టైమ్ టు డై` విడుదల కావాల్సి ఉంది. 1962 నుంచి ఇప్పటి బాండ్ పాత్రధారి డేనియల్ క్రెగ్ వరకు ఆరుగురు బాండ్ పాత్రలు పోషించారు. వారిలో చెప్పుకోదగ్గవారు సీన్ కానరీ, రోజర్ మూర్, పియర్స్ బ్రాస్నన్. సీన్ కానరీ 6, రోజర్మూర్ 7, పియర్స్ బ్రాస్నన్ 4, డేనియల్ క్రెగ్ 5 చొప్పున బాండ్ సినిమాలు చేశారు.
జేమ్స్‌బాండ్ సిరీస్‌లో వస్తున్న తాజా సినిమా `నో టైమ్ టు డై` ఈ ఏడాది సమ్మర్‌కే రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా నవంబర్‌లో విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తన ఉధృతిని కొనసాగిస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఏప్రిల్ 2, 2021లో `నో టైమ్ టు డై` చిత్రం ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. డేనియల్ క్రెగ్ ఈ సినిమాతో జేమ్స్‌బాండ్ సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడు. ఈ సినిమాకి క్యారీ జోజి దర్శకత్వం వహించాడు. 250 మిలియన్ డాలర్స్‌తో భారీగా నిర్మించిన ఈ సినిమాలో గత బాండ్ సినిమాలతో పోలిస్తే యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎక్కువగానే ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు ట్రైలర్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో తెలియజేస్తున్నాయి. ఈ సినిమా కథాంశం గురించి చెప్పుకోవాలంటే జేమ్స్ బాండ్‌కు ఓ శాస్త్రవేత్తని రక్షించే మిషన్ అప్పగిస్తుంది సిఐఎ. ఈ క్రమంలో బాండ్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొని పని పూర్తి చేశాడు అనేది కథాంశం. సినిమా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా క్యారీజోజి తెరకెక్కించాడు. బాండ్ సిరీస్‌లో డై అనే పదంతో చాలా సినిమాలు వచ్చాయి. టుమారో నెవర్ డైస్, డై ఎనదర్ డే, లివ్ అంట్ లెట్ డై. ఈ క్రమంలో ఇప్పడు నో టైమ్ టు డై అంటూ తన విన్యాసాలతో ప్రపంచ ప్రేక్షకుల్ని థ్రిల్ చెయ్యడానికి వచ్చే సమ్మర్లో రాబోతున్నాడు జేమ్స్‌బాండ్.













