రావు రమేష్ సోషల్ మీడియా వాడకపోవడానికి కారణమేంటంటే
లెజెండరీ యాక్టర్ రావు గోపాలరావు కొడుకు రావు రమేష్ తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ తన తండ్రి చేసిన లాంటి క్యారెక్టర్లే చేస్తూ తండ్రి స్థాయిని అందుకున్నాడు. అయితే తండ్రి ఉండగా రావు రమేష్ యాక్టింగ్ లోకి అడుగుపెట్టలేదు. ఆయన చనిపోయాక కూడా తండ్రి పేరు చెప్పుకుని సినిమాల్లోకి రాలేదు. ఒక కొత్త నటుడిగా స్వతహాగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలే చేసుకుంటూ వచ్చాడు.
అలాంటి రావు రమేష్ ఇప్పుడు గొప్ప క్రేజ్ ను సాధించి బిజీ ఆర్టిస్టుల్లో ఒకడైపోయాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రావు రమేష్ బయట ఎక్కువగా కనిపించరు. సోషల్ మీడియాలో అయితే అసలు లేరు. రావు రమేష్ ఇంత లో ప్రొఫైల్ మెయిన్టెయిన్ చేయడం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ ఇదే ప్రశ్నను రావు రమేష్ ను అడిగింది.
మీరు సోషల్ మీడియాలో ఎందుకు లేరు అని అడగ్గా, దానికి రావు రమేష్ సోషల్ మీడియాలోకి వస్తే ప్రైవసీ, ప్రశాంతత కోల్పోతామని అందుకే అందులోకి అడుగుపెట్టలేదని ఆయన బదులిచ్చాడు. అలా మీరొక్కరే ప్రశాంతంగా ఎలా ఉంటారు, మీరు కూడా సోషల్ మీడియాలోకి రావాల్సిందే అని సుమ సరదాగా అనగా, అయితే త్వరలోనే వచ్చేస్తా అని రావు రమేష్ అంతే సరదాగా చెప్పాడు.













