అరవింద సమేతలో….ఆ సన్నివేశాలు వెంటనే తొలగించాలి
అరవింద సమేత సినిమాలో రాయలసీమ ప్రాంతాన్ని అవమానపరిచేలా పలు సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించి చిత్రదర్శకుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థి నేతలు మాట్లాడుతూ యువతను తప్పుదోవ పట్టించేలా ఫ్యాక్షనిజాన్ని చూపుతున్నారని ఆరోపించారు. రాయలసీమ ప్రజల్లో దైర్యాన్ని పెంచే చిత్రాలు తీయకుండా తప్పుదోవ పట్టించేవి తీయడం ఏమేరకు సమంజమని ప్రశ్నించారు. బ్యాంకాక్‌లో కూర్చుని కథలు రాయడం తగదన్నారు. రాయలసీమ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే ఓ స్టూడియో కట్టించి యువతకు ఉపాధి ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో సమితి అధ్యక్షుడు కె.రవికుమార్, రాయలసీమ ఉద్యమకారుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధి సీమ కృష్ణ, రాయలసీమ యూత్ ఫ్రంట్ ప్రతినిధి జలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.













