రవితేజ కొత్తగా ట్రై చేస్తే ఫ్లాపే..
రవితేజ కెరీర్లోని బిగ్గెస్ట్ హిట్స్ లో దాదాపు చాలా వరకు మాస్ మసాలా మూవీలే. రవితేజ పక్కా మాస్ సినిమా చేశాడంటే అది మినిమం గ్యారెంటీ హిట్ అని నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే రవితేజ పేరుకు ముందు మాస్ మహారాజా అనే టైటిల్ ఉంది. రవితేజ చేసిన మాస్ సినిమాలకు మంచి టాక్ వస్తే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.
సినిమాలు హిట్ అవుతున్నాయి కదా అని ఎప్పుడూ ఒకేరకం సినిమాలు చేయడానికి రవితేజ ఇష్టపడడు. మధ్యమధ్యలో డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్తగా ప్రయోగాలు చేసిన రవితేజ ఆ సినిమాలను చాలా సీరియస్ గా తీసుకుని ఎంతో సిన్సియర్ గా నటించాడు కూడా. కానీ అవేమీ ఆయనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.
నా ఆటోగ్రాఫ్, సారొచ్చారు, డిస్కో రాజా ఇలా రవితేజ కొత్తగా ట్రై చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఏవీ తీసిపారేసే సినిమాలు కాదు. ఆ సినిమాల ట్రీట్మెంట్ సరిగా లేకపోవడంతో అవి ఫ్లాపయ్యాయి. తాజాగా రవితేజ అలానే ట్రై చేసిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. రవితేజ ఎప్పుడు కొత్తగా ట్రై చేసినా సరే ఆ సినిమా తనకు ఫ్లాపులనే అందిస్తుంది.













