హ్యాట్రిక్ హిట్ కొట్టాలంటే ఆ మాత్రం పర్ఫెక్షన్ తప్పనిసరి అంటున్న రవితేజ?
ఒక సినిమాకి స్క్రిప్ట్ దశ నుంచి షూటింగ్ పూర్తయ్యే వరకు ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొంతమంది దర్శకులు మాత్రం బౌండెడ్ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి వెళుతుంటారు. అయినప్పటికీ దానిలో కూడా కొన్ని సందర్భాల్లో మార్పులు తప్పవు. దర్శకుడు తాను అనుకున్న కథ స్క్రీన్‌పై పర్ఫెక్ట్గా వస్తుందో లేదో చూసుకుంటూ మార్పులు చేసుకుంటూ వెళ్తుంటారు. అవసరమైతే కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు రవితేజ తాజా సినిమా క్రాక్ విషయంలో కూడా అదే జరుగుతోందని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇంతకుముందు డాన్‌శీను, బలుపు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న క్రాక్ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు గోపీచంద్.
ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే లాక్డౌన్ వచ్చింది. దాంతో షూటింగ్ ఆగిపోయింది. అన్‌లాక్ మొదలైన తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశారు. స్క్రిప్ట్ అనుకున్న తర్వాత షూటింగ్ పూర్తి చేసేందుకు చాలా రోజులు పట్టింది కాబట్టి సినిమా ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు హీరో రవితేజ రషెస్ చూశాడట. సినిమా అంతా బాగానే ఉన్నా కొన్ని సన్నివేశాలు మాత్రం రవితేజకు నచ్చలేదట. సినిమాలో అవి కీలక సన్నివేశాలు కావడంతో రీషూట్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గోపీచంద్‌కి సూచించాడట. ప్రస్తుతం ఆ సన్నివేశాలకు సంబంధించిన రీషూట్ ఒంగోలులో జరుగుతోందని తెలుస్తోంది. ఈమధ్యకాలంలో రవితేజకు చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు పడలేదు. తనకు రెండు సూపర్‌హిట్ సినిమాలు ఇచ్చిన గోపీచంద్ చేస్తున్న ఈ మూడో సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఎట్టిపరిస్థితుల్లో సూపర్‌హిట్ కొట్టాలనే పట్టుదలతో పర్ఫెక్షన్ కోసం రీషూట్ కూడా చేయిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.













