రియల్ స్టోరీతో రానున్న రవితేజ- గోపీచంద్ మూవీ
హిట్టూ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న టైగర్ నాగేశ్వరరావు రవితేజ కెరీర్లోనే హెయ్యెస్ట్ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ సినిమా తర్వాత రవితేజ మరోసారి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాలుగో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
ఈ ఏడాది ఆఖరులో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ని ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. సినిమా కథ నేపథ్యంలో చుండూరు మారణహోమం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఏపీలో చుండూరు అంటే అందరికీ గుర్తొచ్చేది అగ్రవర్ణాలకి చెందిన వాళ్లు దళితవాడపై దాడి చేసి కర్రలు, కత్తులతో వేటాడి చంపిన అంశమే.
ఈ మారణహోమంలో మొత్తం 8 మంది చనిపోయారు. ఆధారాలు లేవని ఏపీ హైకోర్టు నిందితులని నిర్దోషులుగా రిలీజ్ చేసింది. దీంతో దళిత సంఘాలు సుప్రీం కోర్టుని ఆశ్రయించాయి. ఇలాంటి ఘటనతో గోపీచంద్ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ కథను ఉన్నది ఉన్నట్లు తీస్తే మాత్రం సినిమా సెన్సేషన్‌గా మారడం ఖాయం. అసలు ఈ స్టోరీ బ్యాక్ డ్రాప్ విషయంలో ఎంత వరకు నిజమున్నది తెలయాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.













