సౌత్ సినిమా ఇండస్ట్రీ లో బిజీ సైరెన్ మోగిస్తున్న రష్మీక మందన్న
ప్రస్తుతం టాలీవుడ్ లో యమ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మీక మందన్నముందుంటుంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో నాగ శౌర్య సరసన చలో సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా మంచి విజయం సాధించడం తో అక్కడితో ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు దక్కడం, ఆ తరువాత గీత గోవిందం చిత్రం తో మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్లు సాధించి, ఏకంగా టాలీవుడ్ లోనే లక్కీ హీరోయిన్ గా నిలబడింది. ఇక సోషల్ మీడియాలలో సైతం ఎప్పుడూ చురుగ్గా ఉంటూ, తన అభిమానులతో దగ్గరవుతూ వస్తోన్న రష్మీక, ఇప్పుడు తన రెమ్యూనరేషన్ ని కూడా అమాంతంగా పెంచేసింది. ముఖ్యంగా ఈ ఏడాదికి మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ భీష్మ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకొని, తన ప్రస్తుత సినిమాలకు హై రేంజ్ లో పారితోషకాన్ని అందుకుంటోంది. తెలిసిన సమాచారం ప్రకారం రష్మీక ఒక్క సినిమాకు దాదాపు రెండు కోట్ల వరకు తీసుకుంటోందట.
ఇదిలా ఉంటె రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో కథానాయికగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక చిత్తూరు ప్రాంతానికి చెందిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇక తెలుగులో ఫుల్ క్రేజ్ ను సంపాదించిన రష్మిక త్వరలోనే కోలీవుడ్ ఇండ్రస్టీ లో ఎంట్రీ ఇవ్వనుంది. కార్తి సరసన సుల్తాన్ అనే సినిమాతో కోలీవుడ్ అరంగేట్రం చేసింది. ‘రెమో’ ఫేమ్ బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలె షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం రష్మికకు కోలీవుడ్లో మొదటి సినిమా విడుదలవక ముందే మరో క్రేజీ ఆఫర్ వరించిందట.
‘ఆకాశం నీ హద్దురా’ తో మళ్ళి ఫామ్ లోకి వచ్చిన ప్రముఖ హీరో సూర్య సరసన రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. పాండిరాజ్, సూర్య కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్గా రష్మికను అనుకుంటున్నారట. సూర్యతో జోడీ కట్టేందుకు రష్మిక కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోందట. ఈ కాంబినేషన్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట.ఇక ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన రష్మీక, ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేయనుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.













