సౌత్ ఇండస్ట్రీలో జోష్ ని బాలీవుడ్ లో కొనసాగిస్తుందా…?
తెలుగులో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఛలో’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసిన రష్మిక అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో పాటు బాలీవుడ్ లోను రష్మిక మందన్న జోరు నడుస్తోందనే చెప్పాలి. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న రష్మిక మందన్న, అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. తన అందచందాలతో కుర్రకారు మనసులను దోచుకున్న నటి రష్మిక మందనకు గూగుల్ 2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మికను ఎంపికచేసింది.
ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రష్మిక పూర్తి డీ గ్లామరెస్ రోల్లో పల్లెటూరు అమ్మాయిగా కనిపించనున్నట్లు సమాచారం. అలానే యువ హీరో శర్వానంద్ తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమా చేస్తోంది. మొన్నటి వరకు తెలుగు, కన్నడ భాషల్లో తప్ప రష్మిక మరే ఇతర భాషల్లో నేరుగా సినిమాలు చేయని రష్మిక కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం అభిమానులకి పెంచుకుంది. ఆమె నటించిన డియర్ కామ్రెడ్, భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఇటు తమిళ, హిందీ భాషాల్లో డబ్ చేశారు. ఈ సినిమాతో అక్కడి కుర్రాళ్ళ మనసు కొల్లగొట్టింది ఈ బ్యూటీ.
ఇదివరకు ఐశ్వర్యారాయ్ – దీపికా పదుకునే వంటి హీరోయిన్లు కన్నడనాట నుంచి చిత్రసీమకు పరిచయమై బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లుగా ఎదిగారు. ఇప్పుడు వాళ్ళలాగే తాను కూడా హిందీ పరిశ్రమలో తనదైన ముద్రవేయాలని రష్మిక వ్యూహాలు రచిస్తోందని సమాచారం. ఈ మధ్య రష్మిక ఇన్‌స్ట్రాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే ఈ బ్యూటీ మిగతా ఇండస్ట్రీలను వదిలి బాలీవుడ్ వైపు పరుగులు తీస్తుందనే విషయం తేటతెల్లంగా అర్థం అవుతుంది. రాబోయే రోజుల్లో రష్మిక బాలీవుడ్ లో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి.













