థియేటర్‌కి, ఓటీటీకి ఉన్న తేడా అదేనంటున్న రాశీఖన్నా!
రోజు రోజుకీ ఓటీటీ హవా పెరుగుతోంది. ఎందుకంటే థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదనేది అర్థమవుతోంది. ఈనెల 31తో అన్‌లాక్ 3.0 ముగుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్ 4.0 స్టార్ట్ అవుతోంది. అయితే ఈసారి కూడా థియేటర్స్‌కి అనుమతి లభించే అవకాశం లేదని స్పష్టమవుతోంది. మెట్రో రైల్‌కి, మరికొన్ని రంగాలకు కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక థియేటర్స్ ఇప్పట్లో అందుబాటులోకి రావని గ్రహించిన ఓటీటీ సంస్థలు తమ బిజినెస్‌ను మరింత పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొంతమంది దర్శకనిర్మాతలు కూడా ఓటీటీలో వెబ్ సిరీస్‌లను రూపొందించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లో వెబ్ సిరీస్‌ల నిర్మాణం జోరందుకుంది. దర్శకనిర్మాతలే కాదు హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది నటీనటులు వెబ్ సిరీస్‌లలో ఇప్పటికే నటించారు. ఇంకొంతమంది వారి బాటలోనే వెళ్తున్నారు.
తాజాగా హీరోయిన్ రాశీఖన్నా హిందీలో రూపొందే ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాశీ తెలుగు, తమిళ్ సినిమాలు చేస్తూ హీరోయిన్గా బిజీగానే ఉంది. ఈ సమయంలో వెబ్‌సిరీస్‌లు చేయాల్సిన అవసరం ఏముందని ఆమె సన్నిహితులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఓటీటీ రాజ్యమేలుతుందని, కంటెంట్ విషయంలోగానీ, క్వాలిటీలోగానీ, క్రియేటివిటీలోగానీ పెను మార్పులు వస్తాయని రాశీ చెబుతోంది. థియేటర్లలో చూసే సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఎంతో వ్యత్యాసం ఉందని, సినిమాల్లో కొన్ని సీన్స్ అతిశయోక్తిగా అనిపించినా లైట్‌గా తీసుకుంటాం. కానీ, వెబ్ సిరీస్‌లలో అలా కాదు, ప్రతి సీన్ ఎంతో సహజంగా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆ ప్లాట్‌ఫాం అటువంటిదని తన అభిప్రాయాన్ని చెబుతోంది రాశీఖన్నా.













