వైఎస్ఆర్ బయోపిక్ లో రావు రామేష్?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర నేపథ్యంలో యాత్ర బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లో కీలకమైన పాత్రల కోసం నటీనటులను ఎంచుకునే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్రెడ్డి పాత్రలో తమిళ స్టార్ హీరో సూర్య నటించబోతున్నట్లు టాక్ వినిపించింది. అదేవిధంగా వైఎస్ ముఖ్య అనుచరుడు, నమ్మిన బంటు సూరీడు పాత్రలో పోసాని నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా వైఎస్ ఆత్మగా పేరున్న కెవిపి రామచంద్రరావు పాత్రలో విలక్షణ నటుడు రావు రమేష్ నటించబోతున్నట్లు టాక్ వస్తోంది. నిజ జీవితంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కెవిపి రామచంద్రరావుకు మంచి స్నేహం ఉంది. వైఎస్ రాజకీయ వ్యవహారాలన్నీ కెవిపి చక్కబెట్టేవారు. అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం విలక్షణ నటుడు రావు రమేష్‌ను చిత్ర యూనిట్ సంప్రదించిందని అంటున్నారు.













