రావు రమేష్ కోరిక తీరినట్టే!
రావు గోపాలరావు, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఎన్ని సినిమాలొచ్చాయో లెక్క చెప్పమని ఠక్కున అడిగితే కష్టమే. ఖైదీ దగ్గర నుంచి గ్యాంగ్ లీడర్ వరకు వారిద్దరి కలయికలో ఎన్నో హిట్ సినిమాలొచ్చాయి. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. వీరిద్దరూ కలిసి సుమారు దశాబ్ధం పాటూ వెండితెరను ఏలేశారు.
అలాంటి రావు గోపాలరావు కొడుకు రావు రమేష్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు దాటింది. ఎన్నో సినిమాల్లో రావు రమేష్ విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్ గా నటించారు. కానీ ఇప్పటివరకు ఆయన మెగాస్టార్ సినిమాలో విలన్ గా నటించింది లేదు. తన నాన్నకు వెండితెరపై సవాలు విసిరిన చిరంజీవికి విలన్ గా నటించడం తన కోరిక అని రావు రమేష్ ఇప్పటికే పలుసార్లు చెప్పాడు.
చిరంజీవికి కూడా రావు రమేష్ తో నటించాలన్న కోరిక ఉంది. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాతో నటించవా అని చిరంజీవి డైరెక్ట్ గా స్టేజ్ మీదే రావు రమేష్ ను అడిగాడు. కానీ ఇప్పటివరకు ఆ కాంబో సెట్ కాలేదు. ఇప్పుడు చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర తో అది నెరవేరబోతుందని తెలుస్తోంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో గాల్లో తిరిగే ఓ విచిత్రమైన మాంత్రికుడి తరహా పాత్రలో రావు రమేష్ నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మెయిన్ విలన్ లో ఒకరిగా రావు రమేష్ నటించనున్నాడని సమాచారం. వీరిద్దరి కాంబో లేట్ అయినప్పటికీ ఈ సినిమాలో ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆ లేట్ ను మరిపిస్తుందని అంటున్నారు.













