అహింసను పట్టించుకోని రాక్షస రాజు
తేజ దర్శకత్వంలో రానా హీరోగా వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఎంతో మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమా అటు తేజకు, ఇటు రానాకు కూడా చాలా స్పెషల్ మూవీ. ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న వారిద్దరికీ నేనే రాజు నేనే మంత్రి మంచి విజయాన్ని అందించి, వారి కెరీర్ కు చాలా ప్లస్ అయింది.
దీంతో వీరిద్దరూ కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే తేజ రాక్షస రాజు అనే స్టోరీని రెడీ చేసుకున్నాడు. కానీ దానికంటే ముందు తేజ, రానా తమ్ముడితో అహింస అనే సినిమా చేసి ఆ సినిమాతో అభిరామ్ ను తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా అందరి పాలిట హింస గా నిలిచింది.
అహింస డిజాస్టర్ కావడంతో రానా రాక్షస రాజు సినిమాను చేయడనుకున్నారంతా. కానీ రానాకు ఆ కథ బాగా నచ్చడంతో అహింస రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ను ముందుకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల 28న రాక్షస రాజు సినిమాను స్టార్ట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారని, వారి వివరాలు సినిమా మొదలయ్యాక అనౌన్స్ చేసే ఛాన్సుందని తెలుస్తోంది. మరి తేజపై రానా పెట్టుకున్న నమ్మకాన్ని రాక్షస రాజుతో నిలబెట్టుకుంటాడా లేదా చూడాలి.













