రాక్షసరాజుగా రానా
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన తేజ, కెరీర్ స్టార్టింగ్ లో చిత్రం సినిమాతో ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత నువ్వు నేను, జయం లాంటి సినిమాలతో యూత్‌ను ఓ ఊపు ఊపేశాడు. దీంతో తేజ పై అందరికీ మంచి నమ్మకం ఏర్పడింది. కానీ ఆయనపై పెట్టుకున్న అంచనాలను ఆయన తర్వాత అందుకోలేకపోయాడు.
వరుస ఫ్లాపులతో ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు. ఇక తేజ సినిమా తీయడం దాదాపు అసాధ్యం అనుకున్న టైమ్ లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాను తీసి మంచి హిట్ అందుకున్నాడు. రానా హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో రానా నటనతో పాటూ, తేజ డైరెక్షన్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి.
నేనే రాజు నేనే మంత్రి తర్వాత సీత అనే సినిమా చేసిన తేజ కు ఆ సినిమా పరాజయాన్నే మిగిల్చింది. ఇప్పుడు మళ్లీ చాలా గ్యాప్ తర్వాత తేజ, రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటిని హీరోగా పరిచయం చేస్తూ అహింస అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజ తన తర్వాతి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తన తర్వాతి సినిమా రానాతో ఉండబోతున్నట్లు, ఆ సినిమాకు రాక్షస రాజు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు, ఆ సినిమాతో 45 మంది కొత్త నటీనటులను పరిచయం చేయాలని అనుకుంటున్నట్లు కూడా తేజ చెప్పుకొచ్చాడు. అంతేకాదు రాక్షస రాజు సినిమాను కూడా సురేష్ బాబే నిర్మించనున్నట్లు తేజ చెప్పకనే చెప్పాడు.













