రానా అండ్ హిజ్ లీల…కూడానా..
వైవిధ్యభరితమైన కంటెంట్‌తో క్లీన్ అండ్ ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై నేరుగా విడుదలై విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చాలా బాగుందని, నటీ నటులు పాత్రల్లో ఇమిడిపోయారని, నవతరం మనోబావాలకు అద్దం పట్టిందని ప్రేక్షకుల నుంచి పెద్ద యెత్తున ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చిత్ర విజయంపై నిర్మాత రానా దగ్గుబాటి స్పందిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులకు చేరువైనందుకు హ్యాపీగా ఉందన్న రానా చాలా మంది యువతీ యువకులకు జీవితంలో ఎదురయ్యే అనుభవాలే ఈ సినిమాను వారికి బాగా దగ్గర చేశాయని అభిప్రాయపడ్డారు.
ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాల తరహాలోని అనుభవాలు తన జీవితంలో కూడా ఎదురయ్యాయన్నారు. హీరో అతని ముగ్గురు ఆడ స్నేహితులు వారి ప్రవర్తన అన్నీ ఇప్పటి యువతకు అద్దం పట్టేవేనన్నారు. కృష్ణ అండ్ హిజ్ లీలలో నటీ నటులు అందరూ బాగా చేశారని, అయితే ది బెస్ట్ అని చెప్పాలంటే సిద్ధూ (హీరో) గురించే చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ పాత్ర సిద్దూ కాక మరెవరూ చేయలేరేమో అన్నట్టు చేశాడన్నారు. సినిమా సినిమాకి నటనా పరంగా బాగా పరిణితి చెందుతున్నాడంటూ సిద్ధూని అభినందించారు. కరోనా కారణంగా ఓటీటీ మరింత మంది ప్రజలకు చేరువ కావడం కూడా ఈ తరహాలో మంచి,చిన్న సినిమాలకు ఆదరణ పెరిగేందుకు కారణమవుతోందన్నారు. సినిమా ఆద్యంతం సహజంగా అనిపించడం కూడా చిత్ర విజయానికి దోహదం చేసిందని, ఇకపై కూడా తన నుంచి ఈ తరహాలో భిన్నమైన కధాచిత్రాలు ఆశించవచ్చునని స్పష్టం చేశారు.













