టబు చేసిన క్యారెక్టర్లో రమ్యకృష్ణ?
టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో బాలీవుడ్లో రూపొందిన సూపర్‌హిట్ చిత్రం అంధాధున్. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకుడు మేర్లపాక గాంధీ సన్నాహాలు చేసుకుంటున్నారు. నితిన్ హీరోగా రూపొందే ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించనున్నారు. అంధాధున్ సినిమాలో టబు క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. సినిమా విజయంలో టబు క్యారెక్టర్ కీలక పాత్ర పోషించింది. అలాంటి క్యారెక్టర్ తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందని ఆలోచించిన గాంధీ ఫైనల్‌గా రమ్యకృష్ణ అయితేనే ఆ పాత్రకు న్యాయం చెయ్యగలదని డిసైడ్ అయ్యాడు. ఆ పాత్ర కోసం రమ్యకృష్ణను అప్రోచ్ అవగా, ఆమె కూడా ఆ క్యారెక్టర్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపింది. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వనని ఖరాఖండీగా చెప్పిందట. తనకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ముట్టజెప్పాలని డిమాండ్ చేసిందట. దర్శకనిర్మాతలు కూడా ఆమె అడిగిన రెమ్యునరేషన్‌కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
వరస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్‌కి ఈమధ్యకాలంలో `భీష్మ` చిత్రం అందించిన విజయం కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో `రంగ్‌దే` చిత్రం చేస్తున్నాడు నితిన్. అలాగే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. `రంగ్‌దే` చిత్రం మాత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నెలకొని వున్న పరిస్థితులు చక్కబడి థియేటర్స్ స్టార్ట్ అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.













