‘మర్డర్` సినిమాలో వ్యక్తిగతంగా ఎవర్నీ నెగెటివ్‌గా చూపించడం లేదు
రామ్‌గోపాల్‌వర్మ ఏది చేసినా సంచలనమే. అసలు ఏమీ చెయ్యకుండా కేవలం ట్వీట్లతో కూడా సంచలనం సృష్టించగల వ్యక్తి. అయితే ఈమధ్యకాలంలో సినిమాల విషయంలో చాలా బిజీ అయిపోయాడు. లాక్డౌన్ వల్ల అందరూ ఖాళీగా ఇళ్లలో కూర్చుంటే వర్మ మాత్రం ఏదో ఒక సినిమా తీసి ఓటీటీలో వదులుతున్నాడు. ఇటీవల క్లైమాక్స్ పేరుతో ఓ హాట్ సినిమాను ఓటీటీలో విడుదల చేసిన వర్మ ఈనెల 27న నేక్ డ్ పేరుతో మరో శృంగార చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నేపథ్యంలో `కరోనా వైరస్` పేరుతో మరో సినిమాను రూపొందిస్తున్నాడు. అంతేకాదు `ద మ్యాన్ హూ కిల్డ్ గాంధీ`, `కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్` సినిమాలు కూడా రెడీ చేస్తున్నాడు. ఇప్పడు తాజాగా మరో సంచలన చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రకటించాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య అమృత, ప్రణయ్‌ల ప్రేమకథ ఆధారంగా `మర్డర్` పేరుతో ఓ సినిమాను రూపొందించబోతున్నానని ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ప్రకటించాడు వర్మ. తమ కథతో వర్మ సినిమా చేయబోతున్నాడని తెలిసి తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత తెలిపినట్టు ఒక నోట్ సోషల్ మీడియాలో విడుదలైంది. అది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దీనిపై స్పందించిన రామ్‌గోపాల్‌వర్మ “నేను మర్డర్ పేరుతో ఓ సినిమా చేస్తున్నానని, అది అమృత, ప్రణయ్‌ల ప్రేమకథ నేపథ్యంలో చేస్తున్నానని తెలిసి ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత తెలిపినట్టు వచ్చిన నోట్ చూసి నేను చాలా షాక్ అయ్యాను. అయితే ఆ నోట్‌కి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది. ఆ నోట్ ఆమె రాసిందా లేక వేరేవాళ్ళు రాసి ఆమె పేరు పెట్టారో నాకు తెలీదు కానీ, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది.
అసలు ఈ `మర్డర్` అనే సినిమా ఏ కథాంశంతో రూపొందబోతోంది, ఇందులో ఏం చూపించబోతున్నాననే విషయాలు చెప్పదలుచుకున్నాను. నేను పోస్టర్లో రివీల్ చేసినట్టుగా ఇది నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా. అంతే తప్ప నిజ జీవిత కథనే సినిమాగా తియ్యడం లేదు. కొన్ని సంవత్సరాలుగా సమాజంలో జరుగుతున్న ఇటువంటి ఘటనల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల అనుభవాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాను. ఎన్నో ఘటనల ఆధారంగా నేను రాసుకున్న కథలో ఎన్నో కోణాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది. ఈ సినిమాలో నేను ఎవరినీ నెగెటివ్‌గా చూపించడం లేదు. ఎందుకంటే పరిస్థితులే మంచి మనుషుల్ని కూడా నెగెటివ్‌గా మారేలా చేస్తాయి. నేను ఈ సినిమాలో కూడా అదే చూపించబోతున్నాను. మరో విషయం ఏమిటంటే `మర్డర్` పోస్టర్ కోసం నేను వాడిన ఫోటోలు ఇంటర్నెట్లో దొరికే ఫోటోలే. నేను ఎవరి దగ్గర్నుంచి దొంగిలించి వేసినవి కాదు“ అంటూ వివరించాడు వర్మ.













