నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి ముగ్గురు డైరెక్టర్లు రెడీ.. ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్న చరణ్!
నాలుగు నెలలుగా షూటింగులు, థియేటర్లు బంద్ కావడంతో ప్రస్తుతం ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు పూర్తి చేసుకోలేక, కొత్త ప్రాజెక్ట్‌లు సెట్ చేసుకోలేక పెద్ద హీరోలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రామ్‌చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో కలిసి `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 70 శాతం పూర్తయింది. షూటింగులకు అనుమతి రావడంతో సినిమాను పూర్తి చేయాలని రాజమౌళి బృందం భావించింది. కానీ, ఎన్టీఆర్, రామ్‌చరణ్ షూటింగ్ చేయడానికి ఇష్టపడకపోవడంతో సినిమా నిలిచిపోయింది.
ఈ సినిమా పూర్తి కాకుండానే ఎన్టీఆర్ మరో ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పేశాడు. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు. రామ్‌చరణ్‌తో కొరటాల శివ సినిమా ఉంటుందని అందరూ భావించారు. దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. అయితే తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందని కొరటాల ప్రకటించడంతో చరణ్ ఇరకాటంలో పడ్డాడు. ఇంతకుముందే వంశీ పైడిపల్లి, వెంకీ కుడుముల, సురేందర్‌రెడ్డిల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి చరణ్ డిసైడ్ అయ్యాడు. కొరటాల శివతో సినిమా పూర్తయ్యాక ఈ ముగ్గురిలో ఒకరితో సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ, కొరటాల హ్యాండ్ ఇవ్వడంతో ముగ్గురిలో ఎవరితో సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు.
వంశీ పైడిపల్లి మహర్షి తర్వాత మహేష్‌కి ఒక లైన్ చెప్పడం, ఓకే అయిపోవడం జరిగింది. అయితే ట్రీట్మెంట్ మహేష్‌కి నచ్చకపోవడంతో, తర్వాత చూద్దాం అని చెప్పాడు. ఆ కథను తీసుకొని వంశీ.. చరణ్ దగ్గరకు వచ్చాడు. చరణ్ ఆ కథను ఓకే చేశాడు. ఇప్పుడున్న సమాచారం మేరకు చరణ్ తన నెక్స్ట్ సినిమాను వంశీ పైడిపల్లితోనే చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.













