డైలాగ్ రైటర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టిన రమా రాజమౌళి?
సినిమా అనేది టీమ్ వర్క్ అని అందరూ అంటుంటారు. అది నిజం కూడా. సినిమా విజయానికి సమష్టిగా కృషి చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఈ విషయం రాజమౌళికి బాగా తెలుసు. అందుకే తన ప్రతి సినిమాకీ టీమ్‌ని పటిష్టంగా ఉంచుకుంటాడు. ఒక విధంగా రాజమౌళి ఫ్యామిలీ టీమే చాలా పెద్దది. ఈ పని, ఆ పని అని కాకుండా అందరూ అన్ని పనులు చేస్తారు. సినిమా మొదలైన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు ఎంతో కష్టపడతారు. ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నింటికీ కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ వస్తున్న రమా రాజమౌళి ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్‌లోనూ తన సహకారాన్ని అందిస్తోందట.
రాజమౌళి చేసిన సినిమాలన్నంటిలోనూ డైలాగ్స్‌కి పెద్దగా క్రెడిట్ ఉండదు. సినిమాకి ఒక భారీ తనాన్ని, క్రేజ్‌ని తీసుకు రావడంలో రాజమౌళి కీలక పాత్ర పోషిస్తాడు. దాంతో మిగతా క్రాఫ్ట్స్‌కి పెద్ద ప్రాధాన్యం కనిపించదు. బాహుబలి సినిమానే మొదటి భాగానికి డైలాగ్స్ ఎవరు రాశారో క్రెడిట్ లేదు. ఇక రెండో భాగానికి ఇద్దరు రైటర్స్ డైలాగ్స్ రాశారు. వారికి ఎండ్ టైటిల్స్‌లో క్రెడిట్ ఇచ్చారు. అయితే అంత పెద్ద సినిమాకి డైలాగ్స్ రాశారన్న పేరేగానీ వారికి మరో సినిమా రాసే అవకాశం రాలేదు. అంటే రాజమౌళి సినిమాకి పనిచేస్తే ఆ క్రెడిట్ అంతా రాజమౌళికే చెందుతుంది అనేది స్పష్టమవుతుంది.
ఇప్పుడు రాజమౌళి తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారని ప్రకటించారు. సాయిమాధవ్ ఇప్పటికే ఎన్నో గొప్ప సినిమాలకు డైలాగ్స్ అందించారు. అతన్ని అఫీషియల్ డైలాగ్ రైటర్‌గా ఎనౌన్స్ చేయడం సరైనదే. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి రమా రాజమౌళి కూడా డైలాగ్స్ రాస్తున్నారని. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలీదుగానీ సినీ వర్గాల్లో ఈ టాపిక్ రన్ అవుతోంది. సాయిమాధవ్ లాంటి టాలెంటెడ్ రైటర్‌కి మరొకరి సహకారం అవసరం ఉండదని అందరికీ తెలుసు. ఎందుకంటే డైలాగ్స్ విషయంలో ఇప్పటివరకు ఎవరూ చేయని ప్రయోగాలు సాయిమాధవ్ కొన్ని సినిమాల్లో చేసి చూపించారు.
రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా అంటే ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టి డైలాగ్స్ రాస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి చేసే ప్రతి సినిమాకీ కాస్ట్యూమ్స్ వరకే చూసుకునే రమా రాజమౌళి ఈ సినిమాకి సంబంధించి డైలాగ్స్‌ని కూడా రాస్తోందని వార్తలు రావడం వెనుక అసలు విసయం ఏమిటో!













