స్కందలో బోయపాటి.. క్లారిటీ ఇచ్చిన రామ్
స్కంద సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. దీంతో పాటూ షారుఖ్ ఖాన్ జవాన్ కూడా అదే రోజు ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఆ పోటీని తట్టుకుని మరీ స్కంద మంచి వ్యూయర్షిప్తో ముందుకెళ్తుంది. ఇదిలా ఉంటే స్కంద సినిమా ఓటీటీలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా కంటెంట్‌పై కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంది.
ఓ ఫైట్ సీక్వెన్స్‌లో రామ్ రౌడీలను ఎదుర్కొనే క్రమంలో దీపపు కుందులను పట్టుకుని వాళ్లను గాల్లోకి పైకి లేపుతాడు. ఆ షాట్లో ఓ సెకను పాటూ రామ్ కు బాడీ డబుల్ గా స్కంద డైరెక్టర్ బోయపాటి కనిపిస్తాడు. దాన్ని పసగట్టిన నెటిజన్లు ఆ స్క్రీన్ షాట్లతో నెట్టింట తెగ ట్రోల్ చేస్తూ మీమ్స్ చేసి నెట్టింట హల్చల్ చేస్తున్నారు.
దీంతో ఈ విషయంపై హీరో రామ్ స్పందించాడు. ఏప్రిల్ 22న భారీ ఎండల మధ్య 25 రోజుల పాటూ రెగ్యులర్ గా యాక్షన్ షెడ్యూల్ చేశామని, ఆ రోజు సరిగా నడవలేని పరిస్థితి రావడం, దానికి తోడు విపరీతమైన రక్తస్రావం కావడంతో కాస్త రెస్ట్ కోసం పక్కకు వెళ్లాల్సి వచ్చిందని, దీంతో తన డైరెక్టర్ ఆ షాట్ లోకి వెళ్లి తన కోసం దాన్ని కంప్లీట్ చేసినట్లు రామ్ వివరణ ఇచ్చాడు.
అంతేకాదు, ఏదైనా సరే సినిమా నచ్చడం, నచ్చకపోవడం ఆడియన్స్ ఛాయిస్ అని, వాళ్ల అభిప్రాయాలకు తానెప్పుడూ విలువిస్తానని, ఇదంతా ఫ్యాన్స్ కోసమేనని, తన డైరెక్టర్ పట్ల గౌరవమెప్పుడూ తగ్గదని, ఈ సినిమాలాగే తన చెమటని, రక్తాన్ని చిందించడం ఆపనని రామ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సిట్యుయేషన్ ఏదైనా సరే రామ్ రెస్పాండ్ తీరు ఫ్యాన్స్ ను కదిలిస్తోంది. ప్రస్తుతం పూరీతో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్న రామ్, ఆ సినిమా కోసం కూడా భారీగా కష్టపడుతున్నాడు.













