రామ్ నిర్ణయంతో ఫ్యాన్స్ లో నిరుత్సాహం
ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో ట్రాక్ లోకి వచ్చాడనుకున్న రామ్, ఆ తర్వాత కిషోర్ తిరుమలతో కలిసి చేసిన రెడ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి, యావరేజ్ అనిపించుకుంది. మామూలుగా అయితే రెడ్ సినిమా షూటింగ్ ఎన్నో నెలల ముందే పూర్తయింది కానీ కోవిడ్ కారణంగా సినిమా రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వచ్చింది. రెడ్ షూటింగ్ పూర్తయి చాలా రోజులవుతున్నా, రామ్ మాత్రం అప్పటి నుంచి ఖాళీగానే ఉంటూ, కథలు వింటూ కూర్చున్నాడు తప్పించి, సినిమాలు మాత్రం చేయలేదు. మొన్నటికి మొన్న త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి కానీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కమిట్ అవడం వల్ల ఆ సినిమా లేట్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. ఈ గ్యాప్ లో రామ్ మరో సినిమా చేయాలనుకుని తమిళ డైరక్టర్ లింగు స్వామితో సెట్స్ మీదకు వెళ్లడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకుని, దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ముగించుకున్నాడు.
అయితే ఇప్పుడు రామ్, లింగు స్వామిల కాంబినేషన్ అందరికీ చాలా వింతగా అనిపిస్తుంది. తమిళంలో ఒకప్పుడు స్టార్ డైరక్టర్ గా ఒక వెలుగు వెలిగిన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు స్టార్ హీరోలు సినిమాలు చేయాలని ఎంతగానో ఎదురుచూసినప్పటికీ కొన్ని కారణాల వల్ల లింగు స్వామికి తెలుగులో సినిమా డైరక్ట్ చేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం లింగు స్వామి కి ఉన్న ట్రాక్ రికార్డ్ చూసి, తమిళ హీరోలు కూడా ఆయనకు అవకాశమివ్వడానికి ముందుకు రాకపోవడంతో లింగు స్వామి కన్ను తెలుగు ఇండస్ట్రీ పై పడింది.
ఈ నేపథ్యంలో తన కథను హవీష్, గోపీచంద్ లాంటి కొందరు హీరోలకు చెప్పాడట. ఆ ఇద్దరూ లింగు స్వామి కథను రిజెక్ట్ చేయడంతో ఆ కథ రామ్ దగ్గరకు వెళ్లిందని, రామ్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే దాదాపు ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని, ఎన్నో కథలు విన్న తర్వాత కూడా ఫామ్ లో లేని లింగు స్వామి కథకు రామ్ ఓకే చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉందని ఫ్యాన్స్ నిరుత్సాహంతో ఉన్నారు. కానీ రామ్ మాత్రం ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ గా నిలుస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు.













