రామ్ తో మహేష్ మల్టీస్టారర్
ది వారియర్, స్కంద సినిమాలతో వరుస డిజాస్టర్లు అందుకున్న రామ్ పోతినేని త్వరలోనే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే రామ్ తన తర్వాతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్ ఓకే చెప్పాడు. హ్యూమర్ టచ్ తో వైవిధ్యమైన ఎమోషనల్ డ్రామాను రామ్ తో మహేష్ తెరకెక్కించనున్నాడట. ఇప్పటివరకు రామ్ నటించని కొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని, రామ్ తో పాటూ మరో కీలకపాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పాత్రలో ఒక సీనియర్ స్టార్ హీరో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. ఇదెంతో ప్రాధాన్యమున్న పాత్ర అని, ఓ రకంగా చెప్పాలంటే రామ్ తో మహేష్ చేస్తుంది మల్టీస్టారర్ సినిమానే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఆ సీనియర్ హీరో ఎవరనేది మేకర్స్ వెల్లడించే వరకు సస్పెన్స్ గానే ఉండనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.













