అప్పుడు టెక్నికల్‌గా సినిమా ఎలా తియ్యాలో నేర్పాడు… ఇప్పుడు తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతున్నాడు
నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్లో వచ్చిన `శివ` అప్పట్లో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవ్వాలనుకున్న ఎవరైనా రామ్‌గోపాల్‌వర్మలా గొప్ప డైరెక్టర్ అయిపోవాలనుకునేవాడు. అంటే `శివ` సినిమాతో వర్మ అందరికీ ఇన్స్పిరేషన్గా మారాడు. ఆ ట్రెండ్ చాలా కాలం కొనసాగింది. ఒక టెక్నీషియన్‌గా వర్మ అంటే అందరికీ గౌరవమే. కానీ, ఒక వ్యక్తిగా, ఎప్పుడూ వివాదాల్లో తలదూర్చే వ్యక్తిగా కొంతమందికి అతను నచ్చడు. వర్మ ట్విట్టర్లో కామెంట్ చేసినా, ఏదైనా ఇంటర్యూలో మాట్లాడినా అది సెన్సేషనే. ఇప్పుడు మాటలతో కాదు సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు వర్మ. లాక్ డౌన్ సమయంలో తన కంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్న వర్మ వరసగా సినిమాలు చేస్తున్నాడు. థియేటర్స్ లేకపోయినా వాటికి ప్రత్యామ్నాయాలుగా మారిన ఓటీటీ ద్వారా సినిమాలు రిలీజ్ చేస్తూ దండిగా లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పవర్‌స్టార్ అనే మరో సినిమా రూపొందిస్తున్నాడు.
శివ చిత్రంతో టెక్నికల్‌గా సినిమా ఎలా తియ్యాలని కాబోయే దర్శకులకు ఎలాగైతే చెప్పాడో. ఇప్పుడు తక్కువ ఖర్చుతో సినిమా తీసి ఎక్కువ లాభాలు ఎలా రాబట్టాలి అనే విషయాన్ని తను చేస్తున్న సినిమాల ద్వారా తెలియజేస్తున్నాడు. అదెలాగంటే క్లైమాక్స్ చిత్రాన్ని శ్రేయాస్ ఈటీ మీడియా మరియు ఎటిటి యాప్‌లో ‘పే పర్ వ్యూ‘ కింద ఒకసారి వీక్షించేందుకు వంద రూపాయలను రుసుము గా నిర్ణయించారు. ఈ విధానాన్ని చాలా మంది కొట్టిపారేశారు. కానీ, వర్మ మాత్రం ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమా వర్మ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. విడుదలైన 24 గంటల లోపే 1,70,000 మంది 100 రూపాయలు చెల్లించి ఈ సినిమాను వీక్షించారు. అంటే ఈ సినిమా మొదటిరోజే దాదాపు 2 కోట్ల రూపాయల కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్ 10 దాటలేదని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత శ్రీ రాపాకతో చేసిన `నగ్నం` సినిమా రూపొందించడానికి అయిన ఖర్చు కేవలం రెండు వేల రూపాయలు. ఈ విషయాన్ని స్వయంగా వర్మే వెల్లడించడం విశేషం. ఈ చిత్రం కేవలం 12 గంటల లోపల 70 లక్షల వరకు వసూలు సాధించగా దీనికి కూడా ‘పే పర్ వ్యూ‘ పద్ధతిని అవలంబించారు. ఈ చిత్రంలో పనివాడి పాత్రలో నటించిన వ్యక్తి ప్రయాణం కోసం వాడిన రెండు వేల రూపాయలే ఈ సినిమా బడ్జెట్ అని చెప్పడం గమనార్హం. కెమెరా, ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ మొత్తం తన ఆధ్వర్యంలోనే జరిగాయని, దానికి పైసా కూడా తన ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదని వర్మ చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు `పవర్‌స్టార్` పేరుతో వర్మ మరో సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మరో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టబోతున్నాడు. అదేమిటంటే ట్రైలర్ కూడా డబ్బులిచ్చి చూసే పద్ధతి. ఈనెల 16న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాడు. 50 రూపాయలు చెల్లిస్తేనే ఈ ట్రైలర్ చూసే అవకాశం ఉంటుంది. పవర్‌స్టార్ అనే టైటిల్ పెట్టాడు కాబట్టి పవన్‌కల్యాణ్ గురించి ఏం చూపించి ఉంటాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంటుంది. దాంతో ట్రైలర్ కూడా సూపర్‌హిట్ అయి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాను తొలిప్రేమ విడుదల తేదీ అయిన జూలై 24న విడుదల చేయాలని ప్లాన్ చేశాడు వర్మ. ఈసారి టికెట్ ధర 200 రూపాయలుగా నిర్ణయించాడు. మరి ఈ సినిమా కలెక్షన్లపరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అప్పుడు శివతో ఎలాంటి సినిమాలు తియ్యాలో, ఎలా తియ్యాలో చెప్పాడు, ఇప్పుడు తక్కువ ఖర్చుతో సినిమాలు ఎలా తియ్యాలి, ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలో చెబుతున్నాడు. మరి ఈ ట్రెండ్‌ని ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.













