Ram Gopal Varma: సిండికేట్‌తో సత్తా చాటుతానంటున్న ఆర్జీవీ
ఈ మధ్య సత్య(Satya) మూవీ రీరిలీజ్ సందర్భంగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ఎక్స్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. సత్య సినిమా హిట్టయ్యాక తనకు అహంకారం వచ్చిందని, ఆ సినిమా తర్వాత మంచి సినిమాలు తీయాల్సింది పోయి చెత్త సినిమాలు తీసినట్టు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఓ సినిమా తీసి తన సత్తా చాటాలని ఆర్జీవీ తాపత్రయ పడుతున్నాడు.
అందులో భాగంగానే ఆర్జీవీ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ సినిమా పేరు సిండికేట్ అని టైటిల్ కూడా ప్రకటించాడు. ఇండియా ఉనికినే ప్రశ్నార్థకం చేయాలని చూసే ఓ సంస్థపై తీస్తున్న మూవీనే సిండికేట్(Syndicate) అని, మనుషులే జంతువుల కంటే అత్యంత క్రూరమైన వాళ్లనేది ఆ సినిమాకు ట్యాగ్ లైన్ గా పెట్టినట్టు ఆర్జీవీ తెలిపాడు. ఒకప్పుడు ఇండియాలో స్ట్రీట్ గ్యాంగ్స్, తర్వాత స్మగ్లర్లు, ఆపై ఆల్కైదా లాంటివి వచ్చాయి.
గత పదిహేనేళ్లుగా ఇండియాలో ఎలాంటి క్రిమినల్ ఆర్గనైజేషన్స్ లేవని, దేశాల మధ్య కొత్తగా ఇలాంటి క్రైమ్ ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తున్నాయని, దానిపైనే ఓ సినిమా తీయాలనుకుంటున్నట్లు ఆర్జీవీ వెల్లడించాడు. ఈ సినిమాలో మనుషులు ఎంత తీవ్ర స్థాయికి చేరుకోగలరో చూపించనున్నట్లు ఆయన తెలిపాడు. అంతేకాదు సిండికేట్ సినిమాతో ఇన్ని రోజుల తనపై వచ్చిన అపవాదుని తొలగించుకుంటానని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాల్ని తెలియచేస్తానని ఆర్జీవీ ఆ పోస్ట్ లో తెలిపాడు.













