చిరంజీవితో సమానంగా చరణ్‌ని చూడాలనుకుంటున్న అభిమానులు!
మెగాస్టార్ చిరంజీవి దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్ రీ ఎంట్రీ అనగానే అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఆ సినిమాను నిర్మించేందుకు ఎంతో మంది నిర్మాతలు ముందుకొచ్చారు. అందులో అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. కానీ, ఆ సినిమాను తానే నిర్మిస్తున్నట్టు రామ్‌చరణ్ ఎనౌన్స్ చెయ్యడంతో అందరూ షాక్ అయ్యారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్లో ఆ సినిమా రూపొందింది. తను ప్రారంభించిన బేనర్లో చిరంజీవితోనే సినిమాలు తీస్తానని రామ్‌చరణ్ ప్రకటించాడు. అతను చెప్పినట్టుగానే ఆ బేనర్లోనే చిరంజీవి 151వ సినిమా `సైరా`ను ఎంతో భారీగా నిర్మించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను సినిమాగా తియ్యాలన్న తండ్రి కోరికను తీర్చాడు చరణ్. ఆ వెంటనే తన సొంత బేనర్లో కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` చిత్రాన్ని ప్రకటించాడు.
అయితే కొరటాల శివ సన్నిహితుడు నిరంజన్‌రెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్‌లో పార్టనర్‌గా జాయిన్ అయ్యాడు. ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే `ఆచార్య` నుంచి చరణ్ తప్పుకున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తామిద్దరం కలిసే ఈ సినిమాను నిర్మిస్తున్నామని చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో విద్యార్థి నాయకుడుగా అత్యంత కీలకమైన పాత్రను చరణ్ పోషిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలిసింది. అభిమానులు మాత్రం మెగస్టార్ సినిమాలో చరణ్ కూడా ఫుల్‌లెంగ్త్ వుంటే చూడాలని ఉంది అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. గతంలో రామ్‌చరణ్ హీరోగా నటించిన మగధీరలో చిరంజీవి కొద్ది నిమిషాలు కనిపించి అలరించిన విషయం తెలిసిందే. అలాగే ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో కలిసి ఓ పాటలో చరణ్ స్టెప్పులు కూడా వేసాడు. అయితే మెగాస్టార్ లేటెస్ట్ మూవీ `ఆచార్య`లో మాత్రం చరణ్ ఫుల్‌లెంగ్త్ ఉండాల్సిందేనని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవిగానీ, కొరటాల శివగానీ ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. మరి కథ ప్రకారం 30 నిమిషాలు మాత్రమే ఉన్న చరణ్ క్యారెక్టర్‌ను యధాతథంగా ఉంచుతారా లేక అభిమానుల కోరిక మేరకు మార్పు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.













