బుచ్చిబాబు గురించి ఓ రేంజ్లో ఎలివేషన్లు
బుచ్చిబాబు సాన చేసింది ఒక్క సినిమానే అయినా రెండో సినిమాకే రామ్ చరణ్ ను ఒప్పించడంతో అతని క్రేజ్ ఎక్కడికో వెళ్లింది. చరణ్ తో సినిమా చేయడం గొప్ప విషయం కాదు, కానీ ఆ సినిమాలో నటిస్తున్న వాళ్లు, ఆ సినిమాకు పని చేస్తున్న టీమ్.. బుచ్చిబాబు గురించి ఇస్తున్న ఎలివేషన్స్ చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది.
తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రారంభోత్సవంలో బుచ్చిబాబు గురువు సుకుమార్ మాట్లాడుతూ, బుచ్చిబాబు చరణ్ ను ఒప్పిస్తాడని అసలు ఊహించలేదని, ఏఆర్ రెహమాన్ తో మ్యూజిక్ అనగానే తను షాక్ అయ్యానని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. రెహమాన్ సైతం బుచ్చిబాబుని ప్యాషన్ ఉన్న సినిమా పిచ్చోడని చెప్పాడు.
తనకు రంగస్థలం టైమ్ లోనే ఈ సినిమా కథను వినిపించాడని చరణ్ సైతం బుచ్చిబాబుపై పొగడ్తల వర్షం కురిపించాడు. కొద్దిరోజుల క్రితం ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివరాజ్ కుమార్ ఈ సినిమా ప్రస్తావన తెచ్చి బుచ్చిబాబు చెప్పిన కథకు మైండ్ బ్లాంక్ అయిందని, ఎలా ఆలోచించి ఇలాంటి పాత్రలు రాసుకున్నాడా అని షాక్ తిన్నానని మెచ్చుకున్నాడు.
వీళ్లందరూ చెప్తున్న మాటలను బట్టి చూస్తుంటే సినిమాలో మ్యాటర్ గట్టిగానే ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే బుచ్చిబాబు మీద ఇప్పుడు చాలా పెద్ద భారమే ఉంది. చూడ్డానిక ఎంతో సింపుల్ గా కనిపించే బుచ్చిబాబు ఎంతటి పని రాక్షసుడన్నది వీళ్ల మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం బుచ్చిబాబు రెండేళ్లకు పైగా కష్టపడటంతో పాటూ ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేశాడు.













