ఏం ఫిక్స్ చేయకుండానే పూరీ కాన్ఫిడెన్స్ ఏంటి?
లైగర్ సినిమాతో లైమ్ లైట్ లో లేకుండా పోయిన పూరీ జగన్నాథ్ కు తర్వాత ఆఫర్లు లేక చాలా రోజులు ఖాళీగా ఉన్నాడు. మధ్యలో చిరూతో సినిమా అనుకున్నారు కానీ చిరూ వేరే సినిమాలకు కమిట్ అవడం వల్ల ఆ సినిమాకు బ్రేక్ పడింది. దీంతో పూరీ జగన్నాథ్ కు ఓ సారి లైఫ్ ఇచ్చిన రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సినిమా అనౌన్స్ చేశాడు పూరీ.
గతంలో వీరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్‌తో సినిమాను చేసి తనెంటో మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని చాలా కసితో ఉన్నాడు పూరీ. పూరీ కనెక్ట్స్ బ్యానర్లో ఛార్మీ కౌర్, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో శరవేగంగా జరుగుతుంది.
మొదటి షెడ్యూల్ లో భాగంగా డైరెక్టర్ పూరీ, రామ్ పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ ఫైట్ కు సంబంధించిన షూటింగ్ మరో వారం రోజుల పాటూ జరగనుందని చిత్ర వర్గాల సమాచారం. అయితే ఇంత ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న డబుల్ ఇస్మార్ట్ కు సంబంధించి ఇప్పటివరకు సాంకేతిక నిపుణులెవరూ ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది.
హీరోయిన్లుగా ఇప్పటికే నలుగురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను అనుకుంటున్న పూరీ, ఈ నాలుగు రోజుల్లో వారిలో ఒకరిని ఫైనల్ చేయనున్నాడట. మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం ఈ సారి నార్త్ నుంచే తీసుకురావాలని చూస్తున్నాడట. ఇప్పటివరకు ఏ టెక్నీషియన్‌నూ ఫైనలైజ్ చేయని పూరీ, రిలీజ్ డేట్ ను మాత్రం సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్రకటించడం విశేషం. డబుల్ ఇస్మార్ట్ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.













