కూల్ మీడియా..(ర)కూల్ అన్న కోర్టు
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను మెచ్చుకోవాల్సిందే. సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ నానా యాగీ చేసేసి.. పోలీసులూ, విచారణాధికారులు, లాయర్లూ.. ఆఖరికి న్యాయమూర్తులు కూడా తామే అన్నట్టుగా తీర్పులు చెప్పేసే మీడియా కు ఆమె ముకుతాడు వేసే మార్గం కనిపెట్టారు. తన పరువు నిలుపుకునే క్రమంలో భాగంగా మరికొందరు సెలబ్రిటీలను కూడా కాస్తో కూస్తో ఆమె ఇన్స్పైర్ చేశారనే చెప్పాలి.
సుశాంత్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి దాని చుట్టూ అల్లుకున్నడ్రగ్స్ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ కావడం రియా అనే తీగను లాగితే దేశంలోని సినిమా రంగపు డ్రగ్స్ డొంకంతా కదలడం తెలిసిందే. రియా బయటపెట్టిన పలు పేర్లలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో పాటు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే రకుల్ డ్రగ్స్ కేసులో ఉందని తెలిసిందో అక్కడ నుంచి ఇక మీడియా ఆమె పేరుతో పండుగ చేసుకుంటోంది. ఏ చేత్తో ఆహా రకుల్ ఓహో రకుల్ అంటూ ఆమె అందాన్ని, అభినయాన్ని పొగుడుతూ వచ్చిందో అదే చేత్తో ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా రకరకాల వార్తా కధనాలు వండి వడ్డించేస్తోంది.
దీంతో రకుల్‌కి చిర్రెత్తింది. తనకు వ్యతిరేకంగా వస్తున్న మీడియా కధనాలను నిలువరించాలంటూ రెండ్రోజుల క్రితం కోర్టుకెక్కింది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వేసిన ఆమె పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో మీడియా స్వీయ నియంత్రణ పాటించాలంటూ తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మీడియా ఎంతో కొంత సంయమనం పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అయినదానికి కాని దానికీ ప్రతి విషయాన్నీ సంచలనంగా మార్చేస్తూ ప్రజల బుర్రల్లోకి రకరకాల గందరగోళాల్ని చొప్పించేస్తున్న మీడియా సంస్థలకు ఇది ఒక సున్నితమైన హెచ్చరికే అనుకోవాలి. అదే సమయంలో తీర్పులు రాకుండానే తమను ప్రజల దృష్టిలో దోషులుగా మార్చేస్తున్న మీడియాకు ముందస్తుగానే ముకుతాడు వేయడానికి సెలబ్రిటీలకు రకుల్ ఓ మార్గం చూపినట్టు భావించవచ్చు.













