కరణం మల్లేశరి పాత్రలో రకుల్ పీత్ సింగ్?
ప్రస్తుతం దేశంలోని అన్ని భాషల్లో బయోపిక్స్‌కి డిమాండ్ బాగా పెరిగింది. కల్పిత కథల కంటే నిజ జీవిత చరిత్రలతో సినిమాలు తీస్తే ఆదరణ బాగా ఉంటుందని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథలు సినిమాలుగా వచ్చాయి. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా, ఇప్పుడు ప్రముఖ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్ విజేత కరణం మల్లేశ్వరి జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీసేందుకు రచయిత, నిర్మాత కోన వెంకట్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు వారికి గర్వకారణంగా నిలిచి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన కరణం మల్లేశ్వరి పాత్ర కోసం హీరోయిన్ను వెతికే క్రమంలో తాప్సీని సంప్రదించాడు వెంకట్. అయితే తను సినిమాలతో చాలా బిజీగా ఉన్నానని ఆ క్యారెక్టర్ చెయ్యలేనని చెప్పిందట తాప్సీ. ఫిట్నెస్ బాగా ఉన్న హీరోయిన్ అయితే ఆ క్యారెక్టర్‌కి బాగా సూట్ అవుతుందని భావించిన కోన.. రకుల్ ప్రీత్‌ను సంప్రదించాడట. మల్లేశ్వరి పాత్ర గురించి తెలుసుకున్న రకుల్ వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది.
కెరటం అనే ఓ చిన్న సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన రకుల్ మొదట కన్నడలో గిల్లీ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో మంచి సినిమాలు చేసింది. ప్రస్తుతం రకుల్ చేస్తున్న నాలుగు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఈమధ్యకాలంలో ఆమె చేసిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా అవకాశాలు మాత్రం సన్నగిల్లలేదు. పవన్‌కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో రూపొందనున్న విరూపాక్ష చిత్రంలో రకుల్ హీరోయిన్గా ఎంపికైందని వార్తలు వచ్చాయి. అలాగే నితిన్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందే సినిమాలో కూడా నటిస్తోంది. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఇండియన్ 2 వంటి భారీ చిత్రం కూడా రకుల్ చేస్తోంది. మరోపక్క అర్జున్‌కపూర్ హీరోగా హిందీలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా చేస్తోంది. కేవలం పాటలకు పరిమితమయ్యే హీరోయిన్గా కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కే కరణం మల్లేశ్వరి పాత్రను ఎంపిక చేసుకున్న రకుల్‌కి ఈ సినిమా కెరీర్లో ది బెస్ట్‌గా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.













