Raju Weds Ram Bhai: “రాజు వెడ్స్ రాంబాయి” కి అన్ని అవార్డ్స్ దక్కుతాయి – మంచు మనోజ్
అఖిల్, (AKHIL)తేజస్విని (Tejaswini)జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘రాంబాయి నీ మీద నాకు..’ లిరికల్ సాంగ్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్, భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ – మా చిన్నప్పుడు ఈటీవీలో కార్యక్రమాలు చూస్తూ మన పేరు టీవీలో వస్తుందా అని అనుకునేవాడిని. ఈ రోజు ఈటీవీ విన్ వారు చేస్తున్న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు అన్ని పాటలు రాయడం సంతోషంగా ఉంది. ఇది నిజంగా జరిగిన కథ. ఈ కథ గురించి తెలుసుకున్న తర్వాత రాజు..రాంబాయి గురించి ఎలా పాట పాడతాడో రాజు పాత్రలా ఊహించి రాశాను. ప్రేమలో ఉన్న ప్రతి అబ్బాయి, అమ్మాయి జీవితానికి దగ్గరగా ఉండేలా ఈ పాట రాశాను. ఈ పాట లిరిక్ రైటర్ గా నాకు చాలా సంతృప్తిని ఇచ్చింది. అన్నారు.
నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ఈవెంట్ కు మనోజ్ గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. నాకు చాలా ఇష్టమైన పర్సన్ మనోజ్. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేశారు. క్లైమాక్స్ చెప్పినప్పుడు అవాక్కయ్యాను. రేపు థియేటర్స్ లో ప్రేక్షకులు కూడా ఇలాగే అనుభూతి చెందుతారు. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాతో చైతు జొన్నలగడ్డ నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అన్నారు.
నటుడు చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ – ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. నా పాత్ర గురించి చెబితే సస్పెన్స్ పోతుంది. “రాజు వెడ్స్ రాంబాయి” మీ అందరినీ ఆకట్టుకునే మూవీ అవుతుంది. ఈ చిత్ర కథా కథనాలు, పాత్రలు ప్రతి ఆడియెన్ మనసును హత్తుకుంటాయి. అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ – ప్రేమలో ఎదురయ్యే కష్టాలను తట్టుకుని నిలబడేవారే నిజమైన ప్రేమికులు. మనోజ్ అన్న తన ప్రేమ కోసం ఒక యుద్ధం చేశారు. ఆయన చేతుల మీదుగా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాలోని ఈ పాట రిలీజ్ చేసుకోవడం కరెక్ట్ అనిపించింది. మనోజ్ గారు మా ఈవెంట్ కు వచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని ఒక ప్రాంతంలో జరిగిన యదార్థ ఘటన ఈ సినిమాకు మూలం. పదిహేనేళ్లుగా బయటకు రాకుండా సమాధి చేసిన ఆ నిజం ఈ నెల 21న తెలుగు ప్రేక్షకులకు తెలుస్తుంది. అన్నారు.
నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ – ప్రేమ చాలా ప్రమాదకరమైనది, అది సింహాసనం ఎక్కిస్తుంది, శిలువనూ వేయిస్తుంది. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా కథ దర్శకుడి ఊహలోనుంచో, పుస్తకాల నుంచో, కల్పన నుంచో రాలేదు. ఈ మట్టి నుంచి వచ్చింది. రాజు, రాంబాయి ప్రేమలో సంతోషం ఉంది, దుఖం ఉంది. వీళ్లందరి ప్రేమే ఈ సినిమాను నిలబెడుతుందని నమ్ముతున్నా. గతించిన చరిత్రకు, ప్రస్తుత చరిత్రకు ఈ సినిమా ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – మంచు మనోజ్ అన్న ప్రేమ కథ గురించి తెలిశాక ఆయన అభిమానిగా మారిపోయా. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా కథ మొత్తాన్ని ఈ ఒక్క పాటలో చెప్పేశారు మిట్టపల్లి సురేందర్ అన్న. ఆయన ఈ పాటలో రాసిన ప్రతి మాట ఒక తూటాలా పేలుతుంది. అన్నారు.
ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ – మనోజ్ అన్న చేసిన ఉస్తాద్ అనే షోతో ఈటీవీ విన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడూ ఆయన సపోర్ట్ మాకు ఉంటుంది. రాంబాయి నీ మీద నాకు పాట ప్రతి ట్రాక్టర్ లో , ప్రతి ఆటోలో మార్మోగుతూనే ఉంటుంది. ఈ నెల 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను ప్రేక్షకులంతా చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – ఒక్క డైలాగ్, ఒక్క పాట కోసం “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ పాట ఇదే. ఈ పాటను రిలీజ్ చేయడానికి గొప్ప ప్రేమ జంట కావాలి. అది మనోజ్, మౌనిక గారే. మనోజ్ అన్న ప్రతి సినిమాలో ఒక ఛాట్ బస్టర్ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రాంబాయి నీ మీద నాకు..లిరికల్ సాంగ్ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ – మనోజ్ అన్న శ్రీ సినిమాలోని ప్రేమ ప్రేమ పాట నా ఫేవరేట్ సాంగ్. ఫస్ట్ టైమ్ ఈ పాట విన్నాకే నేను ప్రేమ గురించి ఫీల్ అవడం మొదలుపెట్టా. ఇప్పుడు ఆయన మా పాట లాంఛ్ కు రావడం హ్యాపీగా ఉంది. ప్రేమికులు ఈ సినిమాను చూసి నవ్వుతారు, ఏడుస్తారు. సినిమా చూస్తున్న వాళ్లకు వాళ్ల ప్రేమ గుర్తుకొస్తుంది. ఈ పాట ఎంత బాగుందో సినిమా అంత బాగుంటుంది. అన్నారు.
హీరోయిన్ తేజస్వినీ రావ్ మాట్లాడుతూ – రాంబాయి నీ మీద నాకు పాట మీ మనసుల్ని హత్తుకుంటుంది. మీ లైఫ్ లోని రాంబాయిలకు ఈ పాటను డెడికేట్ చేయండి. ఇప్పటికే ఈ సాంగ్ వైరల్ అవుతోంది. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్, సురేష్ బొబ్బిలి ప్రాణం పోశారు. అనురాగ్ కులకర్ణి ఈ పాట పాడుతున్నారు అని తెలియగానే చాలా హ్యాపీగా ఫీలయ్యా. నవంబర్ 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను థియేటర్స్ లో చూసి మా టీమ్ ను బ్లెస్ చేయండి. అన్నారు.
హీరో అఖిల్ ఉడ్డెమారి మాట్లాడుతూ – ప్రేమికులంతా తమ ప్రేయసి కోసం ఇలాంటి పాటలు పాడే ఉంటారు. మీ రాంబాయి కోసం ఈ పాటను మరోసారి తనకు పంపించండి. తప్పకుండా ఇంప్రెస్ అవుతుంది. ఈ సినిమాకు సపోర్ట్ గా నిలిచిన ఈటీవీ విన్ కు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారికి థ్యాంక్స్. నా ఫేవరేట్ యాక్టర్ మనోజ్ అన్న మా సాంగ్ లాంఛ్ కు రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
ప్రొడ్యూసర్ రాహుల్ మోపిదేవి మాట్లాడుతూ – సూపర్ హిట్ ఆల్బమ్ అనే మాట విని చాలా రోజులవుతుంది. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాతో ఆ మాట మళ్లీ వినిపిస్తుందని నమ్ముతున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మా సినిమా ఆల్బమ్ ను అద్భుతంగా తయారుచేశారు. అన్నారు.
సింగర్ నల్లగొండ గద్దర్ నర్సన్న మాట్లాడుతూ – మన మట్టి అంత స్వచ్ఛమైన ప్రేమ కథ “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ సినిమాలోని అన్ని పాటలు మిట్టపల్లి సురేందర్ రాశారు. ఈ ఒక్క పాటే ఇంత బాగుంటే మిగతా పాటలు ఎంత బాగుంటాయో వినాలని ఉంది. సాధారణంగా పాటలు పాడితే గాయకుడు గుర్తుంటాడు. కానీ మిట్టపల్లి సురేందర్ రాస్తే ఆయన గుర్తుంటాడు. అన్నారు.
మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక మాట్లాడుతూ – మాకు ఇదొక ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నాం. ఇలాంటి మీనింగ్ ఫుల్ సాంగ్, మనసుకు హత్తుకునే పాటను మా చేతుల మీదుగా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈటీవీ విన్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నాం. ఇలాంటి అర్థవంతమైన సినిమాలు మరెన్నో మీరు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాం. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ – నా కెరీర్ లో 2.ఓ ఈటీవీ విన్ లో ఉస్తాద్ అనే షో తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత భైరవం, మిరాయ్ లాంటి హిట్ సినిమాలు దక్కాయి. మంచి కంటెంట్ తో మూవీస్, షోస్ చేస్తూ ఈటీవీ విన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ గురించి నాకు తెలుసు. రెండేళ్లుగా ఈ టీమ్ “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా కోసం కష్టపడుతున్నారు. ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది. ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే ఎంటర్ టైనింగ్ మూవీ చేశారు. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా కూడా లైట్ మూవ్ మెంట్స్ తో వెళ్తూ హెవీ ఎమోషన్ తో పూర్తవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్ని అవార్డ్స్ ఈ సినిమాకు వస్తాయి. “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా సక్సెస్ మీట్ కు వచ్చి డీటెయిల్డ్ గా మాట్లాడుతా. జీవితంలో కష్టపడతా, ఎవరినీ మోసం చేయను, బాగా చూసుకుంటా అనే మాటను మౌనికకు ఇచ్చాను. మీరూ మిమ్మల్ని నమ్మి మీతో వచ్చిన వారి చేయిని జీవితంలో వదిలిపెట్టకండి. ఒక ప్రేమ జంటకు జరిగిన అన్యాయాన్ని ఒక ఊరు ఊరంతా బయటకు రాకుండా తొక్కిపెట్టిందంటే అది ఎంత దారుణమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ సాయిలుకు బెదిరింపు కాల్స్ వస్తాయి. అప్పుడు నీకు సపోర్ట్ గా నేనుంటా. ఇలాంటి పాయింట్ ను డైరెక్టర్ సినిమాగా చేశాడంటే అతనికి హ్యాట్సాఫ్. ఇలాంటి మంచి సినిమాను థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.







