సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం
అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. భారతీయ చలన చిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో సినీ రంగంలో విశేష సేవలు అందించిన వారికి 1969 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగా, ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్.
హిందీ చిత్ర సీమ నుండి 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇతర భాషల నుండి ఎంపికయ్యారు. 2018కి గాను బిగ్‌బీ 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. కాగా, తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనుండగా, ఎలక్షన్స్ ముందు కేంద్రం ఈ అవార్డ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ 2000లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.













