తలైవా…పార్టీ ప్రారంభం ఎన్నడూ?
తమిళనాడులో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్న పరిస్థితుల్లో కొత్త పార్టీల ఏర్పాటుకు తమిళ సినీరంగంలో దిగ్గజాలుగా ఉన్న కమల్, రజనీకాంత్‌లు ముందుకు వచ్చారు. కమలహాసన్ పార్టీని ప్రారంభించి ప్రచారంలోకి కూడా దూకేశారు. కాని రజనీకాంత్ మాత్రం ఎందుకో రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసి, పార్టీ ఏర్పాటులో మాత్రం జాప్యం చేస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎఐఎడిఎంకెలో జయలలిత మృతి తరువాత పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా కనిపించడం లేదు. మరోవైపు కరుణానిధి మృతితో ప్రధానప్రతిపక్షమైన డిఎంకెలో కూడా పరిస్థితులు సరిగా లేవు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ కొత్త పార్టీ పెడుతాననే సరికి చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. దానికితోడు ఆయన చేసిన రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన తమిళనాడులో సెన్సేషన్ టాపిక్ అయింది. కాని రాజకీయ ప్రకటన తరువాత పార్టీ ఏర్పాటుకు రజనీకాంత్ ధైర్యం చేయలేకపోతున్నారా? లేక ఏదైనా కారణంతో వాయిదా వేస్తున్నారా అన్న విషయం సరిగా తేలటం లేదు. అభిమానులు మాత్రం పార్టీ ప్రకటన చేయండని పట్టుబడుతున్నారు. రజనీ సినిమాలతో బిజీగా ఉండటంతో అనేక అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమాల విజయానికే రాజకీయాల ప్రకటన చేశారన్న వార్త కూడా వినిపిస్తోంది. మరోవైపు రజనీకాంత్ ఆధ్యాత్మిక భావాలు ఇక్కడ పనిచేస్తాయా లేవా అన్న విషయం స్పష్టంగా తేలటం లేదు. వివిధ పార్టీ నాయకులు మాత్రం ఆధ్యాత్మిక రాజకీయాలు ఇక్కడ సాగవని, ఆయన వచ్చి చేయడానికి ఏమీ లేదని పెదవి విరుస్తున్నారు.
అన్నింటిని మౌనంగా వింటూ వచ్చిన రజనీకాంత్ సమయం వచ్చినప్పుడు మాత్రం రాష్ట్రంలోని రాజకీయ శూన్యతను భర్తీ చేస్తానని, రాష్ట్రంలో ఎంజీఆర్ పాలనను తీసుకొస్తానని ప్రకటించారు. దానికితోడు అవినీతిని రూపుమాపుతాననే వ్యాఖ్యలతో ప్రజలను మళ్ళీ తనవైపునకు తిప్పుతున్నారు. ఆయన సహచర నటుడు కమల్‌హాసన్ పార్టీ ప్రారంభించి ప్రజల్లోకి దూసుకెళుతుండటం, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో సామాజిక మాధ్యమాలలో, నేరుగా స్పందిస్తున్నారు. దీంతో తానే అసలు సిసలైన రాజకీయ నాయకుడినంటూ సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇదే సమయంలో రజనీకాంత్ పార్టీ ప్రారంభానికి కూడా పది నెలలుగా సమయం తీసుకోవడంతో ఆయన వ్యూహమేంటో అంతుచిక్కని పరిస్థితి రాష్ట్ర రాజకీయపార్టీలలో నెలకొంది.
దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా వెండితెరపై తననటనతో అలరిస్తున్నా రజనీకాంత్. ఆయనను సూపర్‌స్టార్‌ను చేసిన అభిమానులు, ప్రజలు సినిమాల్లోలా నిజ జీవితంలో కూడా రాజకీయాల్లోకి వచ్చి కాస్త మంచి చేస్తారని రెండు దశాబ్దాలుగా ఎదురు చూశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు 2017 డిసెంబరు 31న ‘కర్మ చేయడంపై మనుషులకు అధికారం ఉంటుంది. కానీ కర్మ ఫలితంపైకాదు. దేవుడు కరుణించినప్పుడు, సమయం వచ్చినప్పుడు తప్పక వస్తాను’ అంటూ తన రాజకీయ ప్రవేశాన్ని ఘనంగా చాటారు. అప్పటి నుంచి ఆయన పార్టీ ప్రారంభంపై ఇటు అభిమానులు, ఆర్ఎంఎం సభ్యులు, అటు రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఒక పక్క ఎన్నికలు తరుముకొస్తున్నా పార్టీ ప్రారంభ తేదీని రజనీకాంత్ ప్రకటించడం లేదు. ఆయన వ్యూహం అర్థంకాక ఆయన మనసులో ఏముందో తెలుసుకోవాలని తమదైన శైలిలో విమర్శల బాణాలను పలు పార్టీలు సంధిస్తున్నాయి. కానీ ప్రణాళిక ప్రకారం రజనీకాంత్ అడుగులు వేస్తున్నారు. రాజకీయ ప్రవేశ ప్రకటన చేసి పది నెలలు అవుతుండటంతో ఆయన రాకను కోరుకున్న ఒక వర్గంలో నిరాశ మొదలైంది. ఇంతకాలం రాజకీయాల్లోకి రావాలని అభిమానుల పిలుపు, దానికి స్పందిస్తూ రజనీ ప్రవేశప్రకటన వరకు బాగానే ఉంది.
ప్రజలతో మాట్లాడాల్సిన సమయం, రాష్ట్రంలోని వివిధ సమస్యలపై తన వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాల్సిన సమయం రజనీకాంత్‌కు ఆసన్నమైంది. ఇదివరకు ఐపీఎల్ మ్యాచ్, తూత్తుకుడి కాల్పులు, కావేరి వివాదం, చెన్నై-సేలం గ్రీన్ కారిడార్, శబరిమల అంశంపై రజనీకాంత్ స్పందనలు ఆలస్యంగా రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ద్రావిడ రాజకీయాలున్న రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజకీయం ఎలా సాధ్యమవుతుందో చాటుకోవాల్సిన అవసరం కూడా ఆయనపై ఉంది.













