రజనీకాంత్ పార్టీ ఇదేనా ?
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో పార్టీ పెట్టబోతున్నానని, ఇందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 31న వెల్లడిస్తానని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అయితే తాజాగా రజనీ పార్టీ పేరు ఇదేనంటూ తమిళనాట వార్తలు కోడై కూస్తున్నాయి. మక్కల్ సేవై కట్చి పేరుతో తలైవా ఎన్నికల సంఘంలో పార్టీని నమోదు చేసినట్లు, ఆయనకు ఆటో గుర్తు కేటాయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్తగా నమోదైన రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో తమిళనాడుకు చెందిన మక్కల్ సేవై కట్చి పేరుతో ఉన్న పార్టీకి ఆటోరిక్షా గుర్తును కేటాయించింది. అయితే ఈ పార్టీ రజనీకాంత్ పేరుతో ఉండటంతో తలైవా రాజకీయ పార్టీ ఇదేనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా దీన్ని రజనీ వర్గీలు ధ్రువీకరించలేదు. మక్కల్ సేవై కట్చి అంటే ప్రజా సేవ పార్టీ అని అర్థం.
రజనీకాంత్ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి వచ్చిన దరఖాస్తులో పార్టీ పేరు మక్కల్ సేవై కట్చి గా పేర్కొన్న దరఖాస్తుదారుడు.. పార్టీ గుర్తు కోసం తొలి ప్రాధాన్యంగా రజనీ నటించిన బాబా సినిమాలోని ఫేమస్ సింబల్ హస్త ముద్ర ను, రెండో ప్రాధాన్యంగా ఆటోరిక్షా గుర్తును ఎంపిక చేయాలని ఈసీని కోరారు. అయితే హస్త ముద్ర.. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు దాదాపు పోలినట్లుగా ఉండటంతో ఎన్నికల సంఘం తిరస్కరించింది. మక్కల్ సేవై కట్చి పార్టీకి ఆటో రిక్షా గుర్తు కేటాయించినట్లు తెలిపింది.













