అమెరికాకు… సూపర్ సూపర్ స్టార్ రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి వైద్య పరీక్షల కోసం అమెరికా వెళుతున్నారు. ఇందుకోసం ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించినట్టు తెలిసింది. 70 ఏళ్ల రజనీకాంత్ తరచుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో అంటే 2011లో కూడా వైద్య కోసం విదేశాలకు వెళ్ళారు. ఇటీవల అణ్ణాతై సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడ్డారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కోలుకున్నాక మళ్ళీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.
రజనీకాంత్ ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళతారని తెలిసింది. ఈసారి కూడా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. కానీ కరోనా కారణంగా అమెరికా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరినట్టు తెలిసింది. అనుమతి రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రజనీ వైద్య కోసం అమెరికా వెళుతున్నారని తెలియగానే అయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కేవలం ఇది రెగ్యులర్‌గా జరిగే పరీక్షల కోసమని తెలియడంతో వారు ఊపిరి పీల్చుకుంటున్నారు.













