ఆరోగ్యం సహకరించడం లేదు…రాజకీయపార్టీ ఏర్పాటు చేయలేను-రజనీకాంత్
తమిళనాడుతోపాటు, దక్షిణాదిలో ఉన్న అభిమానులను నిరాశపరుస్తూ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. ఆరోగ్యం సహకరించని కారణంగా రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు. తనకు అరోగ్యం సహకరించనందున రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని స్పష్టం చేశారు. అనారోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇందుకు తనను క్షమించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి రాకుండానే సేవ చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను ట్విటర్లో షేర్ చేశారు. కాగా అన్నాత్తే షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురైన రజనీకాంత్ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. హైబీపీతో బాధపడిన ఆయన ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు.
2017లో రాజకీయాల్లోకి రావడం ఖాయం అని బహిరంగంగా ప్రకటించి అభిమానులను ఉత్సాహపరిచిన రజనీకాంత్ తరువాత వాయిదా వేస్తూ, చివరకు జనవరిలో కొత్త పార్టీ పెడుతానని, డిసెంబరు 31న ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అంతేగాక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సమూలంగా మార్చివేస్తామని పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణాలతో రజనీ ప్రస్తుతం రాజకీయ పార్టీ స్థాపనపై వెనక్కి తగ్గారు. కుటుంబ సభ్యులు ముఖ్యంగా కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య ఒత్తిడి మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













