హీరోగా తనేమిటో తెలుసుకున్న రాజ్ తరుణ్… డైరెక్టర్‌గా తనేమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు?
కొంతమంది ఇండస్ట్రీకి ఒక లక్ష్యంతో వస్తారు. కానీ, ఇక్కడి పరిస్థితుల కారణంగా వాళ్ళు అనుకున్న దానికి విరుద్ధమైన శాఖలో స్థిరపడాల్సి వస్తుంది. ఇలాంటి విచిత్రాలు సినిమా రంగంలోనే జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా సింగర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కిశోర్‌కుమార్ నిజానికి హీరో అవ్వాలని ముంబయ్ ట్రైన్ ఎక్కాడు. కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ సినిమా ఇండస్ట్రీ అతన్ని సింగర్‌ని చేసేసింది. తెలుగులో కూడా అలాంటివారు చాలా మంది ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కెరీర్ కొనసాగిస్తున్న చాలా మంది నటీనటులు ఒకప్పుడు హీరో, హీరోయిన్ అయిపోయి ఇండస్ట్రీని ఏలేద్దామని వచ్చినవాళ్ళే. రవితేజ, నాని, రాజ్ తరుణ్.. ఇలా ఇప్పుడు హీరోలుగా కొనసాగుతున్నవారు ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసినవారే.
రాజ్ తరుణ్ విషయమే తీసుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన అతను ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరో అయ్యాడు. అది కూడా విచిత్రంగా జరిగింది. ఆ సినిమా దర్శకుడు విరించి వర్మ ప్రస్తుతం తెలుగులో పాపులర్ అయిన ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నాడు. కానీ, ఆ హీరో హ్యాండ్ ఇచ్చేసరికి ఎవరిని హీరోగా పెట్టాలని ఆలోచిస్తున్నపుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన దగ్గర వర్క్ చేస్తున్న రాజ్ తరుణ్ అతని దృష్టిలో పడ్డాడు. అంతే ఒక్కసారిగా అతని దశ మారిపోయింది. డైరెక్టర్ అవుదామని వచ్చి అసిస్టెంట్‌గా ఒక్క సినిమా కూడా పూర్తి చేయకుండానే హీరో అయిపోయాడు. ఆ తర్వాత సినిమా చూపిస్త మావా, కుమారి 21ఎఫ్ వంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీ సంగతి అందరికీ తెలిసిందే కదా. ఏ హీరోకైనా వరసగా ఫ్లాపులు వచ్చాయంటే అతన్ని పక్కన పెట్టేసి కొత్త ముఖం కోసం వెతుక్కుంటారు. ఇప్పడు రాజ్ తరుణ్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈమధ్యకాలంలో విడుదలైన సినిమాలన్నీ ఈరుణ్కి నిరాశనే మిగల్చాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన ఒరేయ్ బుజ్జిగా కూడా అదే బాటలో పయనిస్తోంది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలోనే మరో సినిమా ప్రారంభమై షూటింగ్ కూడా జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే హీరోగా తన కెరీర్ ముగిసింది అనుకున్నాడో ఏమో రాజ్ తరుణ్ ఇప్పుడు డైరెక్షన్ వైపు దృష్టి పెట్టబోతున్నాడట. డైరెక్టర్ అవ్వాలన్న ఎయిమ్తోనే ఇండస్ట్రీకి వచ్చిన తరుణ్ తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మెగా ఫోన్ పట్టుకోవాలని తహతహలాడుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కథలు కూడా సిద్ధం చేసుకున్న తరుణ్ త్వరలోనే దర్శకుడిగా తన తొలి సినిమాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. తను డైరెక్ట్ చేయబోయే తొలి హీరో సునీల్ అని సమాచారం. అతని కోసమే తను రాసుకున్న కథతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాజ్ తరుణ్ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ఏ బేనర్లో ఎవరు నిర్మిస్తారనే విషయం మాత్రం బయటకు రాలేదు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లాలని రాజ్ తరుణ్ చూస్తున్నాడు కాబట్టి ఆ వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. హీరోగా తన కెరీర్ గ్రాఫ్‌ని స్పీడ్‌గా పెంచుకున్న రాజ్ తరుణ్ అంతే స్పీడ్‌గా కిందకి దిగిపోయాడు. మరి ఇప్పుడు దర్శకుడుగా తన కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.













