మెగాస్టార్ చిరంజీవి ఆపోజిట్ రెహమాన్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో విలన్ పాత్రకు మాజీ హీరోను ఎంపిక చేసినట్టు సమాచారం. ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను ఈ మాజీ హీరో తెలుగులో చేయబోతున్నారట. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్‌లాల్ ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి పోయి పరిస్థితులు చక్కబడితే ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే చిత్ర యూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే, ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు( రఘు) రెహమాన్ పోషిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రెహమాన్‌ను నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సుజీత్ ఇప్పటికే సంప్రదించారని.. ఈ పాత్ర చేయడానికి రెహమాన్ కూడా ఆసక్తి చూపించారని అంటున్నారు.
రెహమాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మలయాళంలో 90ల్లో రెహమాన్ స్టార్ హీరో. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో రామ్ చరణ్‌కు ఆయన తండ్రిగా నటించారు. ‘జనతా గ్యారేజ్’, ‘అంతరిక్షం’ సినిమాల్లోనూ ఆయన కనిపించారు. రెండు రోజులుగా దీనికి సంబంధించిన సంప్రదింపుల వార్తలు రాగా, తెలుగు వెర్షన్ లో ఆ పాత్ర చేయడానికి రహమాన్ ఓకే చెప్పినట్టుగా సమాచారం. ముందుగా తెలుగులో కూడా వివేక్ ఒబెరాయ్ చేత ఆ పాత్రను చేయించడానికి సంప్రదింపులు జరిగాయట. అయితే అతడు అందుకు సుముఖం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. తొలిసగంలో వివేక్ పాత్ర క్రూయల్ విలన్ గా మెరిసినా, ఆ తర్వాత మళ్లీ ప్రాధాన్యత ఉండదు. అలాంటి పాత్రలను రహమాన్ కూడా పండించగల నటుడే. అయితే ఈ సినిమాకు ఇంకా చాలా మంది ప్రముఖ నటుల అవసరం ఉండవచ్చు. మంజూవారియర్ పాత్రకు సుహాసినిని తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ధ్రువీకరణ లేదు. మలయాళీ వెర్షన్ లో దర్శకనటుడు పృథ్విరాజ్ సోదరుడు ఇంద్రజిత్ సుకుమారన్ చేసిన పాత్ర కూడా ఆరంభంలో ప్రాధాన్యత ఉండేదే. పృథ్విరాజ్ చేసిన పాత్రతో సహా మరిన్ని ఆసక్తిదాయకమైన పాత్రల్లో తెలుగు వెర్షన్లో ఎవరు కనిపిస్తారనేది ఆసక్తిదాయకమైన విషయం.













