‘మీరు బ్రతకండి.. సినిమాను బ్రతకనివ్వండి’ రివ్యూలపై ఫైర్ అయిన రఘు కుంచె
ఒక సినిమా హిట్ అయిందా? ఫ్లాప్ అయ్యిందా? అనే విషయం రిలీజ్ రోజు మార్నింగ్ షోకే తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే రిలీజ్ అయిన రెండు మూడు రోజులకు మౌత్‌టాక్ వల్ల సినిమా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంటుంది. అయితే మార్నింగ్ షో పడిన రెండు, మూడు గంటల్లోనే ఆ సినిమాను విశ్లేషిస్తూ వెబ్‌సైట్స్‌లో రివ్యూలు వచ్చేస్తాయి. సినిమా హిట్ అయితే ఆ హిట్‌కు ప్లస్‌లను, ఫ్లాప్ అయితే అందుకు కారణమైన మైనస్‌లను ఆయా రివ్యూల్లో ప్రస్తావిస్తారు. అందుకే సినిమా రివ్యూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే సినిమా సూపర్‌హిట్ అంటూ 3 పైన రేటింగ్ ఇచ్చిన సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు, 2 కంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన సినిమాలు సూపర్‌హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇది రేర్‌గా జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడీ విషయాల్ని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం `47 డేస్` అనే సినిమా. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె సహ నిర్మాతగా చేసిన `47 డేస్` సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొన్నివెబ్ సైట్స్ దారుణమైన రేటింగ్స్ ఇవ్వడంపై రఘు కుంచె ఫైర్ అయ్యాడు. సినిమాను బతకనివ్వండి, మీరు బతకండని ఆవేదన చెందాడు. అంతేకాకుండా రివ్యూ రైటర్లపైనా సెటైర్స్ వేశాడు. ‘భయ్యా నా సినిమా కళాఖండం అని నేను ఎక్కడా చెప్పలేదు. మరీ 1, 1.5 రేటెడ్ ఫిల్మ్‌గా అభివర్ణించిన మేధావులతో మాట్లాడుతున్నా. ఇండస్ట్రీ రోజు రోజుకి సంక నాకుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. భయ్యా. ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీరు ఎంతో చూశారు. చూస్తున్నారు. నిజాయితీగా.. సినీ మీడియాలో మీరందరూ ఒక సినిమా మొదలైన దగ్గర నుంచి ఆ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ప్రేక్షకుల్లోకి ఎలా తీసుకెళ్లాలి, బిజినెస్ సోర్స్ ఏంటి ఎలా హైప్ తీసుకురావాలి అని ఎంతో మనసు పెట్టి నిర్మాతను గైడ్ చేస్తూ నిజాయితీగా సినిమా కోసం పని చేస్తారు.
ఈ సందర్భంలో ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్, దర్శకురాలు కీర్తిశేషులు శ్రీమతి బి.జయ మేడమ్గారి మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. దివంగత బి.జయగారు ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. `మేము ఒక చిత్రం నిర్మాణంలో 24 విభాగాల కష్టం కళ్లారా చూస్తాం. కాబట్టి సినిమాలని మా శక్తి మేరకు ప్రమోట్ చేస్తామే తప్ప తక్కువ చేసి రాయం. దాన్ని మీరు భజన అనుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు` అంటూ ఆమె చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు రఘు కుంచె. ఎంతో ఎఫర్ట్ పెట్టి, సినిమా మీద ఎంతో నమ్మకంతో పనిచేసిన నటీనటులుగానీ, దర్శకనిర్మాతలుగానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రివ్యూలపైన ఇలా స్పందించడం సర్వసాధారణమే. ఇదే విషయాన్ని మరో సినిమా రిలీజ్ అయ్యే సరికి అందరూ మర్చిపోతారు. సినిమాను ప్రమోట్ చేస్తూ రాసినా, విమర్శిస్తూ రాసినా అంతిమ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. వారిని గనుక మెప్పిస్తే సినిమా విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నది అందరూ తెలుసుకుంటే ఇలాంటి వివాదాలు ఎప్పటికీ రావు.













