మరోసారి మానవత్వం చాటుకున్న లారెన్స్
అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సినీ ప్రముఖుల్లో రాఘవ లారెన్స్ కూడా ఒకరు. గ్రూప్ డాన్సర్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి ఆ తర్వాత డాన్స్‌మాస్టర్‌గా ఎంతోమంది టాప్ హీరోల పాటలకు డాన్స్ కంపోజ్ చేసిన లారెన్స్ దర్శకుడిగా కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆలోచనతోనే పేదలకు తనకు తోచిన సాయం చేస్తుంటాడు లారెన్స్. ఇప్పటివరకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించడమే కాకుండా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు కూడా చేయించారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే… లారెన్స్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
కన్యాకుమారి దగ్గరలోని ఓ గ్రామంలో నివాసముండే అశోక్ అనే జర్నలిస్ట్ తల్లి తిరువనంతపురంలోని సిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె భౌతిక కాయాన్ని అశోక్ సొంత గ్రామానికి తరలించాలి. ఆమె చికిత్స నిమిత్తం లక్షన్నర రూపాయల వరకు సిమ్స్కి చెల్లించాల్సి ఉంది. కానీ, అశోక్ చెల్లించే స్థితిలో లేడు. ఇది లారెన్స్ దృష్టికి రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఓ లేఖ రాశాడు. ‘‘కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. మీ సహాయ నిధికి విరాళం అందించేందుకు మా అమ్మతో సహా మిమ్మల్ని కలవడం గౌరవంగా భావించాను. ఇప్పుడు మీ నుంచి నేను ఓ సహాయాన్ని అర్థిస్తున్నాను’’ అంటూ అశోక్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఆ లేఖలో పేర్కొన్నాడు. అశోక్ సిమ్స్కి చెల్లించాల్సిన లక్షన్నర రూపాయలను రెండు రోజుల్లో తాను చెల్లిస్తానని, పెద్ద మనసుతో అర్థం చేసుకొని భౌతిక కాయాన్ని వారి గ్రామానికి పంపించేందుకు సహకరించాలని కోరాడు. మరి దీనిపై కేరళ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.













