పుష్ప2 బిజినెస్ విషయంలో తగ్గేదేలే!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప2 పై ఎంత హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఏడు నెలల టైమ్ ఉన్నప్పటికీ పుష్ప2 బిజినెస్ విషయంలో మాత్రం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ముందు నుంచే ప్లానింగ్ లో ఉంది. థియేట్రికల్ ఆఫర్లు కూడా దానికి తగ్గట్టే వస్తుండటంతో తాము అనుకున్నట్లు లెక్క ముట్టజెప్తే అడ్వాన్స్ తీసుకునేందుకు నిర్మాతలు రెడీ గా ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల నుంచి 200 కోట్లు, ఓవర్సీస్ నుంచి 100 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ బయ్యర్లు మాత్రం ఇంత భారీ మొత్తాన్ని పెట్టి రిస్క్ చేయాలా అని ఆలోచిస్తున్నారు. అయితే పుష్ప2 నిర్మాతలు ఈ సినిమాకు పెద్ద మొత్తంలో బిజినెస్ ఆశించడానికి చాలానే రిజన్లున్నాయి.
యానిమల్, సలార్1 సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు చూసి పుష్ప2 నిర్మాతలకు ధైర్యం వస్తోంది. అంటే ఇక్కడ బన్నీ రణ్బీర్, ప్రభాస్ కంటే ఎక్కువని కాదు కానీ పుష్ప క్రేజ్ దేశ వ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. దానికి తోడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇప్పటివరకు ఉన్న క్రేజ్ ఆకాశానికి అంటుతుందని తెలుస్తోంది. అందుకే పుష్ప2 బిజినెస్ విషయంలో నిర్మాతలు తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.













