రెండో సినిమా చేయడానికి 12 ఏళ్ళు… మూడో సినిమాకి ఎన్నేళ్ళు పడుతుందో?
హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉంటారు. ఒకప్పుడు హీరోలకు అభిమాన సంఘాలు ఉండేవి. అప్పట్లో డైరెక్టర్ ఎవరైనా కానీ అభిమానుల దృష్టంతా తమ హీరోపైనే ఉండేది. కాల క్రమేణా దర్శకులకు, సంగీత దర్శకులకు కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఒక సినిమా విజయం వెనుక దర్శకుడి ప్రతిభ ఏమిటి అనేది ప్రేక్షకులు తెలుసుకున్నారు. అందుకే తమ అభిమాన హీరో సినిమా ఫలానా దర్శకుడితో అయితే బాగుంటుంది అనే జడ్జిమెంట్‌కి కూడా వచ్చేసారు. ఇప్పటి దర్శకుల్లో భిన్నమైన శైలి ఉన్నవారు కొందరు ఉన్నారు. వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన చేసే సినిమాల్లో కథ, కథనాలు విభిన్నంగా ఉంటాయి. హీరో క్యారెక్టరైజేషన్ విచిత్రంగా, ఒకింత ఆశ్చర్యకరంగానూ ఉంటుంది. హీరో పవన్‌కల్యాణ్ గురించి చెప్పాలంటే అతని స్టయిల్గానీ, మేనరిజంగానీ డిఫరెంట్‌గా ఉంటుంది. మరి ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఉదాహరణ `బద్రి`. ఈ సినిమాతోనే పూరి జగన్నాథ్ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. హీరోగా పవన్‌కల్యాణ్‌కు, డైరెక్టర్‌గా పూరికి మంచి పేరు వచ్చింది. మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేద్దామని అనుకున్నారు. కానీ, కుదరలేదు. దాదాపు 12 సంవత్సరాల తర్వత `కెమెరా మెన్ గంగతో రాంబాబు` చిత్రంతో మళ్లీ కాంబినేషన్ కుదిరింది. హెవీ కంటెంట్ వల్ల ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్‌కి, పూరికి అభిప్రాయ భేదాలు వచ్చాయని, మళ్లీ ఇద్దరూ కలిసి సినిమా చేయకూడదని ఎవరికి వారు డిసైడ్ అయ్యారని వార్తలు వచ్చాయి. వార్తలు వచ్చినట్టుగానే ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి సినిమా చెయ్యలేదు. తాజా సమాచారం మేరకు పవన్, పూరి కలిసి మరోసారి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అజ్ఞాత వాసి తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి తాత్కాలికంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ `వకీల్‌సాబ్`తో మళ్లీ కెమెరా ముందుకు వచ్చాడు. రావడమే కాదు, ఈ సినిమా తర్వాత తాను ఎవరెవరి కాంబినేషన్లో సినిమాలు చేయబోతున్నాడో ప్రకటించాడు. ఆ లిస్టులో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా మరో సినిమా వినిపిస్తోంది. అదే.. పూరి జగన్నాథ్ కాంబినేషన్లో చేయబోయే సినిమా. ఇటీవల నటుడు, నిర్మాత బండ్ల గణేష్…. పవన్‌ను కలవడం, అతనికి సినిమా చేస్తానని పవన్ ప్రామిస్ చేయడం తెలిసిందే. ఆ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్లో నిర్మించేందుకు బండ్ల గణేష్ సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం. ఇంతకుముందు అల్లు అర్జున్‌తో నిర్మించిన ఇద్దరమ్మాయిలతో చిత్రానికి, ఎన్టీఆర్‌తో చేసిన టెంపర్ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథే అనే విషయం తెలిసిందే.
ఇప్పుడు పవన్‌తో గణేష్ చేయబోయే సినిమాకి కూడా పూరి జగన్నాథే దర్శకుడన్న వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే బండ్ల గణేష్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే. బద్రి తర్వాత పవన్, పూరి కలిసి రెండో సినిమా చేసేందుకు 12 ఏళ్ళు పట్టింది. మూడో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రారంభం కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పటికే పవన్ లిస్ట్‌లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అవన్నీ పూర్తవ్వాలంటే రెండు మూడేళ్ళు ఖచ్చితంగా పడుతుంది. అంటే మూడో సినిమా చేయడానికి పవన్‌కి, పూరికి మరో పదేళ్ళు పట్టిందని అంచనా వెయ్యొచ్చు.













