‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ కి రామ్, పూరి జగన్నాథ్ సిద్ధమవుతున్నారా?
సినిమా రంగంలో ఏదైనా జరగొచ్చు అనే దానిపై ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కొంతమంది కెరీర్ ఒక్క సినిమాతోనే టర్న్ అవుతుంది. పెద్ద స్టార్ హీరో అయిపోతారు. కొంతమంది టెక్నీషియన్స్ అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా వారి దారిని మార్చే సినిమా ఒక్కటి ఉంటుంది. దానికోసమే ఎంతో ఓపికగా ఎదురుచూస్తారు. మరి అంతకుముందు ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేసి కొన్ని సినిమాల వల్ల వెనకబడ్డ వారి పరిస్థితి ఏమిటి? అంటే వారు కూడా ఆ ఒక్క సినిమా కోసం ఎదురుచూడాల్సిందే. అలాంటి ఒకే ఒక్క సినిమా ముగ్గురి కెరీర్‌ని మార్చేసింది. నేను శైలజ సినిమా తర్వాత మూడు సినిమాలు చేసిన రామ్‌కి సరైన హిట్ లభించలేదు. టెంపర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఓ అరడజను సినిమాలు చేశాడు. కానీ, ఏ ఒక్కటీ కమర్షియల్‌గా హిట్ అవ్వలేదు. ఇక 1992లో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చిన మణిశర్మ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఎన్నో మ్యూజికల్ హిట్ ఇచ్చి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీని ఏలాడు. అలాంటి మణిశర్మకి సినిమాల పరంగా ఎక్కడా బ్రేక్ రానప్పటికీ అప్పటివరకు టాప్ హీరోల సినిమాలకు మాత్రమే మ్యూజిక్ చేస్తూ వచ్చిన అతను ఆ సినిమా, ఈ సినిమా అని కాకుండా అన్ని సినిమాలకూ మ్యూజిక్ చేశాడు. అయితే అంతకుముందు అతనికి ఉన్న స్టార్డమ్ మాత్రం తెచ్చుకోలేకపోయాడు. మరి ఈ ముగ్గురూ ఒకే సినిమా చేస్తే… అందరికీ టర్నింగ్ పాయింట్‌గా నిలిచే సినిమా అదే అయితే ఎలా ఉంటుంది. ఆ ఒక్క సినిమానే `ఇస్మార్ట్ శంకర్`.
ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని పక్కా మాస్ క్యారెక్టర్లో నటించిన రామ్ తన పెర్ఫార్మెన్స్తో ఈ సినిమాను ఇరగదీశాడు. అలాగే పూరి జగన్నాథ్ తన కెరీర్లో చాలా కాలం తర్వాత మరో భారీ కమర్షియల్ హిట్‌ని అందుకున్నాడు. ఇక మణిశర్మ డిఫరెంట్ మ్యూజిక్‌తో ఈ సినిమాను మ్యూజికల్హిట్ చేశాడు. ఈ సినిమాలోని పాటలు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయాయి. ఈ ఒక్క సినిమాతో అతనికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ప్రస్తుతం అతను 10 సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నాడంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిన విషయమే.
ఈ సినిమా సాధించిన విజయానికి ఉబ్బితబ్బిబ్బయిన పూరి వెంటనే దీనికి సీక్వెల్ చేస్తానంటూ హిట్ ఇచ్చాడు. అంతేకాదు `డబుల్ ఇస్మార్ట్ శంకర్` అనే టైటిల్‌ని కూడా రిజిష్టర్ చేయించాడు. ఈ సినిమా వెంటనే స్టార్ట్ అవుతుందని అందరూ భావించారు. కానీ, పూరి మాత్రం ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టి విజయ్ దేవరకొండతో `ఫైటర్` చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. తమిళ్లో సూపర్‌హిట్ అయిన తడమ్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న `రెడ్` చిత్రంతో రామ్ కూడా బిజీ అయిపోయాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. రెడ్ తర్వాత రామ్ చేయబోయే సినిమా ఏమిటనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే ఫైటర్ తర్వాత పూరి ఏ సినిమా చేస్తాడు అనే విషయం ఇప్పటివరకు తెలీదు. లాక్డౌన్ సమయంలో పూరి 7 కథలు సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన పార్టనర్ ఛార్మి తెలియజేసింది. వాటిలో డబుల్ ఇస్మార్ట్ శంకర్ కథ కూడా ఉన్నట్టు సమాచారం. దీన్నిబట్టి చూస్తే త్వరలోనే ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ రామ్, పూరి కాంబినేషన్లో నెక్స్ట్ రాబోయే సినిమా ఇదేనన్న సమాచారం అందుతోంది.













