డిజాస్టర్లొచ్చినా ప్రభాస్ రేంజ్ మారట్లేదు
ప్రభాస్ ఏ ముహూర్తాన బాహుబలి కి సైన్ చేశాడో కానీ, అప్పటి నుంచి ప్రభాస్ స్థాయి పెరుగుతూనే వచ్చింది. బాహుబలితో ప్రభాస్‌కి వచ్చిన క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఒక సినిమాతో ఈ రేంజ్లో ఎదిగిన హీరో ఎవరూ కనిపించరు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్‌కు తర్వాతి రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మిగిలాయ. సాహోకు ఓపెన్సింగ్స్ అయినా బాగా వచ్చాయి కానీ రాధేశ్యామ్‌కు ఓపెనింగ్స్ కూడా రాలేదు.
దీంతో అంతా ప్రభాస్ ను చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఆదిపురుష్ టీజర్‌కు వచ్చిన నెగిటివిటీ కూడా దీనికి తోడైంది. కానీ ఇప్పుడు కూడా ప్రభాస్ కు సరైన సినిమా పడాలే కానీ తన రేంజ్ ఏంటో బాక్సాఫీస్ చూస్తుందనే అంచనాతో ఉన్నారు ఫ్యాన్స్. సలార్, ప్రాజెక్ట్-కె సినిమాల మీద ఉన్న అంచనాలు, వాటికి వస్తున్న బిజినెస్ ఆఫర్ల ప్రభాస్ స్టామినా ఏం తగ్గలేదని సంకేతాలిస్తున్నాయి.
రీసెంట్గా ప్రభాస్ సత్తాకు నిదర్శనంగా ప్రాజెక్ట్- కె కు సంబంధించిన నైజాం రైట్స్‌ను షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే చాలా ముందుగా ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ కొనేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఏడాది పైగానే టైమ్ ఉన్నా, ఈ లోపే ఫ్యాన్సీ రేటుకు నైజాం రైట్స్ కొనుగోలయ్యాయంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు నైజాంలో ఎక్కువ బిజినెస్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సమానంగా ఈ సినిమా రేట్ చేసిందంటే మామూలు విషయం కాదు. ఇది ప్రభాస్ స్టామినాకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. ఫాంటసీ టచ్ ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.













