Raju Weds Rambai: మన కళ్లముందు జరుగుతున్న కథ అనే ఫీలయ్యే మూవీ “రాజు వెడ్స్ రాంబాయి” – సాయికృష్ణ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా “రాజు వెడ్స్ రాంబాయి”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ సాయి కృష్ణ సినిమా హైలైట్స్ తెలిపారు.
– ఓటీటీ అంటే పెద్దలు మాత్రమే చూడగలిగే కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం ఉంది. మేము ఆ ట్రెండ్ ను బ్రేక్ చేస్తూ ఈటీవీ విన్ లో సకుటుంబంగా చూసే సినిమాలను, సిరీస్ లను అందిస్తున్నాం. ఆ క్రమంలోనే 90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్, ఎయిర్, అనగనగ, లిటిల్ హార్ట్స్ వంటి మూవీస్ చేశాం. అప్పట్లో ఉషాకిరణ్ మూవీస్ సకుటుంబంగా చూసే సినిమాలు నిర్మించేవి. ఆ బ్యానర్ కు మోడరన్ ఎక్స్టెన్షన్ లా ఈటీవీ విన్ ను తీర్చిదిద్దుతున్నాం. మన దేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువ. వారికి కనెక్ట్ అయ్యేలా మన చుట్టూ జరుగుతున్న స్టోరీస్ నే నిర్మిస్తున్నాం. “రాజు వెడ్స్ రాంబాయి” స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా ఇది మన నేటివ్ కథ అనిపించింది.
– వరంగల్, ఖమ్మం జిల్లా మధ్య ఉండే ఓ ఊరిలో జరిగిన ఘటన నేపథ్యంగా “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ఉంటుంది. ఈ ఘటన గురించి నేను కూడా విన్నాను. దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ చెప్పాక డెమో షూట్ చేయమన్నాం. ఆయన చేసిన కొన్ని సీన్స్ చూసి మూవీ బాగా చేయగలడు అనే నమ్మకం కలిగింది. ఏడాదిన్నర కిందట ఈ చిత్రాన్ని ప్రారంభించాం. వాతావరణ పరిస్థితుల వల్ల కొంత షూటింగ్ ఆలస్యమైంది. అలాగే ఆ ఊరి ప్రజలు షూటింగ్ కు నిరాకరించారు. మళ్లీ వాళ్లను ఒప్పించి షూటింగ్ చేశాం.
– ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చాక కథలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. వాస్తవంగా జరిగిన ఘటన ఆధారంగా చేసిన క్లైమాక్స్ ను మేము ఒప్పుకుంటామో లేదో అని పెట్టకుండా మరో క్లైమాక్స్ షూట్ చేసి చూపించారు. మేము ఒరిజినల్ క్లైమాక్స్ ఉంటేనే బాగుంటుందని తీసుకున్నాం. దర్శకుడు సాయిలు సినిమాను రూపొందించిన విధానం చూస్తే ఆ మూవీలో ఇలాంటి దుర్ఘటనను తెరకెక్కించారా అని అనిపించదు. కొన్ని డైలాగ్స్ మరీ ఆ ఊరు, ఆ చుట్టుపక్కల వాళ్లకే అర్థమయ్యేలా ఉన్నాయని వాటిని వద్దని ఆడియెన్స్ అందరికీ అర్థమయ్యే మాటల్ని పెట్టించాం.
– దర్శకుడు సాయిలులో ఉన్న నిజాయితీ, ఇన్నోసెన్స్, ఫ్యూరిటీ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు మనం ఒక ఊరిలో కూర్చుని చూస్తున్నట్లు ఉంటుంది. దర్శకుడిగా అతనికి పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చాం. ఈ సినిమాకు అనుకున్నదాని కంటే కొంత ఎక్కువ బడ్జెట్ అయ్యింది. ఎక్కువ భాగం ఊరిలోనే షూటింగ్ చేశాం. దాదాపు అంతా కొత్తవాళ్లే మా సినిమాను వర్క్ చేశారు.
– రాజు పాత్రలో అఖిల్ పర్పెక్ట్ గా నటించాడు. అతనొక మంచి యంగ్ హీరోగా పేరు తెచ్చుకుంటాడనే నమ్మకం ఉంది. తేజస్వినీ రాంబాయి క్యారెక్టర్ కు పూర్తి న్యాయం చేసింది. రాంబాయి తండ్రి వెంకన్న పాత్రలో చైతన్య జొన్నలగడ్డ ఆకట్టుకునేలా నటించాడు. వంశీ నందిపాటి, బన్నీవాస్ గారితో మా అసోసియేషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ తర్వాత మా కాంబినేషన్ కు “రాజు వెడ్స్ రాంబాయి” మరో హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. దర్శకుడు వేణు ఊడుగుల గారితో ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఎలాంటి డిలే లేకుండా త్వరగా ఓకే అయ్యింది.
– ఈటీవీ విన్ లో డిసెంబర్ లో కనకమహాలక్ష్మి 2 వెబ్ సిరీస్ వస్తోంది, అలాగే తిరువీర్ సినిమా ఒకటి స్ట్రీమింగ్ చేయబోతున్నాం. నెలకో కొత్త మూవీని స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం.






