ఆ నిర్మాత నుంచి మరో డిఫరెంట్ సినిమా
డిఫరెంట్ సినిమాలతో తన అభిరుచిని చాటుకుని సక్సెస్ అందుకుంటున్న టాలీవుడ్ నిర్మాత రాహుల్ యాదవ్ నక్క. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అతను తీసిన మొదటి సినిమా మళ్ళీ రావా ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. ఆ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తర్వాత జెర్సీ తో మంచి హిట్ అందుకున్నాడు.
మళ్ళీ రావా తర్వాత రాహుల్ నిర్మించిన రెండో సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి రేంజ్ మరింత పెరిగిన విషయం తెలిసిందే. రాహుల్ నుంచి వచ్చిన మూడో సినిమా మసూద. ఈ సినిమాతో సాయి కిరణ్ అనే కొత్త దర్శకుడిని రాహుల్ పరిచయం చేశాడు. ఇలా ప్రతీసారి కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తూ రాహుల్ సినిమాలు చేస్తూ మంచి విజయాలని అందుకుంటున్నాడు.
ఇక తాజాగా రాహుల్ తన బ్యానర్ నుంచి మరో సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆర్విఎస్ నిఖిల్ అనే కొత్త డైరెక్టర్ ను రాహుల్ టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు. ఈ సినిమా కామెడీ- ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. తాతా, మనవళ్ల మధ్య నడిచే ఈ సినిమాకు బ్రహ్మ ఆనందం అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.













