అటెన్షన్ కోసం రాసే రాతలను నమ్మొద్దు: నాగవంశీ
ఏ టైమ్లో త్రివిక్రమ్, మహేష్ సినిమాను అనౌన్స్ చేశారో కానీ, అప్పటి నుంచి సినిమాకు ఏదో రూపంలో సమస్య వస్తూనే ఉంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంటే విచిత్రంగా జరిగింది. అల వైకుంఠపురములో సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్, కొన్ని కారణాల వల్ల దాన్ని క్యాన్సిల్ చేసి మహేష్ మూవీని అనౌన్స్ చేశారు.
ఆ తర్వాత స్క్రిప్ట్ విషయంలో ఏవో జరిగాయి. ముందు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీని ఓకే చేసి షూట్ కు వెళ్లారు. కానీ ఆ తర్వాత అవుట్పుట్ చూసి వెనక్కి తగ్గారు. తమ కలయికలో ప్రేక్షకులు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎక్స్పెక్ట్ చేస్తారని, త్రివిక్రమ్ మనసు మార్చుకున్నారు. కొంచెం గ్యాప్ తీసుకుని కొత్త కథతో ప్రయాణం మొదలుపెట్టారు. మహేష్ కొన్ని నెలల తేడాలోనే తన తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లడం లేట్ అయింది.
అన్నింటిని దాటుకుని కొన్ని నెలల కిందటే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. షూటింగ్ హ్యాపీగా కొనసాగుతుంది. కానీ ఇంతలో మహేష్ త్రివిక్రమ్ మూవీ గురించి రూమర్లు మొదలయ్యాయి. షూట్ చేసిన కంటెంట్ విషయంలో అసంతృప్తిగా ఉండటంతో వాటిని పక్కన పెడుతున్నట్లు వార్తలొచ్చాయి. దీని గురించి నెట్టింట జరుగుతున్న ప్రచారానికి తోడు మీడియాలోనూ వార్తలు రావడంతో చిత్ర నిర్మాత నాగవంశీ స్పందించాడు. ఈ ప్రచారాన్ని వంశీ ఖండించాడు
అటెన్షన్ కోసం ఇలాంటి రాతలు రాస్తారని, వీటిని చూసి నవ్వుకోవడం తప్పించి చేసేదేమీ లేదని ఆయన సెటైర్ వేశారు. అంతేకాదు , ఫ్యాన్స్ కూడా ఇలాంటివి వచ్చినప్పుడు పట్టించుకోవద్దని ఆయన పేర్కొన్నారు. మహేష్28 ఫ్యాన్స్ కు గుర్తిండిపోయే సినిమా అవుతుందని నాగవంశీ క్లియర్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.













