రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నిర్మాత, అతని తండ్రి మృతి
ఈమధ్యకాలంలో సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. కొందరు కరోనా వల్ల ప్రాణాలు విడుస్తుంటే, మరికొందరు అరోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు. ఇంకొంతమంది ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎఎఫ్‌సి నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్స్‌లో ఒకరైన నిర్మాత కమలాకర్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఇటీవల కమలాకర్‌రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయనతో కలిసి ఉన్న కమలాకర్‌రెడ్డికి కూడా కరోనా సోకింది. నెల్లూరు సమీపంలోని ఓ పల్లెటూరులో ఉంటోంది కమలాకర్‌రెడ్డి కుటుంబం. ఈ ఇద్దరూ కరోనాకు మెరుగైన చికిత్స పొందడం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కమలాకర్ రెడ్డితో పాటు ఆయన తండ్రి కూడా అక్కడికక్కడే మృతి చెందారు.
అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారాణాలపై ఆరా తీస్తున్నారు. ఇటీవల విడుదలైన `కనులు కనులను దోచాయంటే` చిత్రాన్ని కెఎఫ్సి ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. నిర్మాత కమలాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ఇద్దరూ మృతి చెందడం అందర్నీ కలచివేసింది.













