ప్రియాంక అభిరుచికి రెండు పురస్కారాలు
ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా నిర్మాతగానూ అభిరుచిని చాటుకుంటోంది. తన తల్లి మధు చోప్రాతో కలసి పర్పుల్ పెబ్బెల్ పిక్షర్స్ సంస్థను ప్రారంభించి ప్రాంతీయ భాషల్లో కథా ప్రాధాన్యమున్న చిత్రాలను నిర్మిస్తోంది ప్రియాంక. అందులో భాగంగానే పాఖీ ఎ.టైర్వాలా దర్శకత్వంలో నేపాలీ భాషలో పహునా, ది లిటిల్ విజిటర్స్ చిత్రాన్ని తెరకెక్కించింది. సిక్కిం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ముగ్గురు పిల్లలు తిరిగి ఇంటికి చేరడానికి ఎలాంటి కష్టాలు పడ్డారన్న విషయాన్ని హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించారు. ఇప్పుడీ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం తాజాగా పురస్కారాలు కైవసం చేసుకుంది. జర్మనీలో జరుగుతున్న స్క్యింజెల్ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంలో దీనికి రెండు పురస్కారాలు లభించడం విశేషం. యూరోపియన్ చిల్డ్రన్స్ ఫిలిం అవార్డ్, ది ప్రొఫెషనల్ జూరీ విభాగాల్లో ఈ చిత్రానికి పురస్కారాలు దక్కాయి. మా సంస్థలో ఇలాంటి మరిన్ని ఉత్తమ చిత్రాలను నిర్మించేందుకు ఈ పురస్కారాలతో ప్రోత్సాహం లభించిందన్నారు మధు చోప్రా.













