మేము ఇంకా వివాహ తేదీని నిర్ణయించుకోలేదు
బాలీవుడ్ నటి, క్యాంటికో ప్రియాంక చోప్రా, అమెరికన్ సింగర్, రచయిత నిక్ జొనాస్ వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదట. అసలు ఆ ఆలోచనే ఇంకా వారి మనసులోకి రాలేదట. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం ముంబాయిలోని ప్రియాంక స్వగృహంలో జరిగింది. ఆ కార్యక్రమం అనంతరం నిక్ కుటుంబ సభ్యులు అమెరికా వెళ్లిపోయారు. వీరి వివాహం అక్టోబర్‌లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. నిశ్చితార్థం తర్వాత తొలిసారిగా ప్రియాంక తల్లి మధు చోప్రా మీడియాతో మాట్లాడింది. మేము ఇంకా వివాహ తేదీని నిర్ణయించుకోలేదు. అది త్వరలో ఉంటుంది. అక్టోబర్‌లో మా అమ్మాయి వివాహం అంటూ జరుగుతున్న ప్రచారం అంతా అబద్దం. ప్రస్తుతం ప్రియాంక, నిక్‌లు కొన్ని ప్రాజెక్టులు చేసేందుకు అంగీకరించి ఉన్నారు. అవి మొదట పూర్తి కావాల్సి ఉంది. అందుకే వివాహం ఎప్పుడు జరపాలన్నది తెలియడానికి కొంత సమయం పడుతుంది అని పేర్కొంది. వివాహం ఏ పద్ధతిలో చేస్తారన్న దానిపై ఆమె స్పందిస్తూ, భారతీయ సంప్రదాయ పద్ధతిలోనే వివాహం చేయాలని నేను భావిస్తున్నా. అది నా కోరిక మాత్రమే. అందులో భాగంగా నిశ్చితార్థానికి జరిగిన రోకా పూజా చాలా ముఖ్యమైంది. అది మన సంప్రదాయంలో చేశాం అని వెల్లడించింది.













