ప్రేమపిపాసి చిత్రంలో పాటను విడుదల చేసిన మంత్రి తలసాని
నేటి అభిరుచులకు తగిన సంగీతం, సాహిత్యంతో పాటు బాగుంది. నవ్యతను నమ్మి చిత్రబృందం చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలి అని అన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీవర్మ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ప్రేమపిపాసి. పి.ఎస్.రామకృష్ణ నిర్మాత. మురళీరామస్వామి దర్శకుడు. ఈ చిత్రంలోని ఐఫోన్ లాంటి పిల్లంటూ అనే పాటను మంత్రి శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ యువతరం మనోభావాలకు దర్పణంలా ఉండే చిత్రమిది. నిజమైన ప్రేమ గొప్పతనాన్ని చాటిచెబుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు చక్కని ఆదరణ లభిస్తున్నది. ఈనెల 13న ఈ సినిమాను విడుదల చేయనున్నాం అని తెలిపారు. జ్యోతిరాజ్పుత్, మమత శ్రీచౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆర్టస్, పాటలు: సురేష్ ఉపాధ్యాయ, అలరాజు.













