ప్రశాంత్ వర్మ దృష్టంతా కరోనా వైరస్ పైనే!
ఒక మంచి కథతో సినిమా తీసి దాన్ని అందరూ ఆదరించేలా చేయడం ఎంతో కష్టమైన పని. ఒక మంచి సినిమా తియ్యడం వేరు, కమర్షియల్ సక్సెస్‌ను తియ్యడం వేరు. ఇక్కడ కమర్షియల్ సక్సెస్‌కే ఎక్కువ వేల్యూ ఉంది. కొంతమంది దర్శకులు చేసే సినిమాలు అందరికీ నచ్చుతాయి. ప్రతి ఒక్కరూ చాలా మంచి సినిమా తీశావు అని మెచ్చుకుంటారు. కానీ, ఆ సినిమా తీసిన నిర్మాతకు మాత్రం ఎలాంటి లాభం చేకూరదు. అలాంటి దర్శకుల్లో ప్రశాంత్‌వర్మ ఒకరు. హీరో నాని నిర్మాతగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మంచి స్టార్ కాస్టింగ్‌తో ప్రశాంత్‌వర్మ తీసిన సినిమా `అ!`. ఇది ఒక విభిన్న చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంది. కానీ, కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత డా.రాజశేఖర్ హీరోగా `కల్కి` పేరుతో ఓ సినిమా చేశాడు. అది కూడా చక్కని కాన్సెప్ట్ బేస్డ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. కానీ, కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
ఇప్పుడు తన మూడో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే పనిలో నిమగ్నమై ఉన్నాడు ప్రశాంత్. తను ఇంతకుముందు చేసిన రెండు సినిమాల ఫస్ట్‌లుక్‌లోనే క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనే హింట్ ఇచ్చాడు. ఇప్పుడు మూడో సినిమాకి కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. సోషల్ మీడియా వేదికగా `నా నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్‌ను మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను` అంటూ ట్వీట్ చేశాడు. తాజా సమాచారం మేరకు కరోనా వైరస్ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ మూడో సినిమా ఉంటుందట. ఈ సినిమాకి సంబంధించిన వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే రామ్‌గోపాల్‌వర్మ నిర్మాణంలో అగస్త్య మంజు దర్శకత్వంలో `కరోనా వైరస్` పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు.













